జైల్లో ఏటీఎం.. ఎక్కడంటే..!

28 Nov, 2020 20:06 IST|Sakshi

బిహార్‌ పూర్నియా సెంట్రల్‌ జైలులో తొలిసారి ఖైదీల కోసం ఏటీఎం

మరో రెండు వారాల్లో జైల్లో ఏటీఎం ఏర్పాటు

పట్నా: ఏటీఎంలు వచ్చాక బ్యాంకులకు వెళ్లే పని సగం తగ్గిపోయింది. లేదంటే బ్యాంకు టైమ్‌ లోపల వెళ్లి ఓచర్‌ రాసి డబ్బులు డ్రా చేయాలంటే ఓ రోజంతా పట్టేది. డబ్బులు అత్యవసరం ఉండి.. అదే రోజు బ్యాంకుకు సెలవు ఉంటే ఇక చెప్పలేం. ఈ కష్టాలన్నింటికి ఏటీఎంతో ఫుల్‌స్టాప్‌ పడింది. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏటీఎం సేవలు అందుబాటులోకి వచ్చాయి. చేతిలో కార్డు ఉంటే చాలు.. నిమిషాల వ్యవధిలో డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే తాజాగా ఖైదీల కోసం జైల్లో కూడా ఏంటీఎం ఏర్పాటు చేయబోతున్నారు. బిహార్‌లోని పూర్నియా సెంట్రల్‌ జైలు అధికారులు ఖైదీల కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావించారు. ఖైదీలకు తమ అవసరాల నిమిత్తం డబ్బు కావాలంటే కుటుంబ సభ్యులు వచ్చి ఇవ్వాల్సిందే. దీని వల్ల గేటు దగ్గర ఎక్కువ మంది గుమిగుడుతున్నారు. దీన్ని నివారించడం కోసం ఏటీఎం ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. (చదవండి: ఇలాంటివి కూడా చోరీ చేస్తారా..!)

ఈ సందర్భంగా పూర్నియా సెంట్రల్‌ జైలు సూపరిండెంట్‌ మాట్లాడుతూ..  ‘జైలు ప్రాగణంలో ఏటీఎం ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ ఎస్‌బీఐకి లేఖ రాశాము. మరో రెండు వారాల్లో ఏటీఎం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నాం’ అన్నారు. ప్రస్తుతం జైలులో 750 మంది ఖైదీలు ఉన్నారని.. అందులో 600 వందల మందికి వేర్వేరు బ్యాంకుల్లో ఖాతాలున్నాయని తెలిపారు. ఇప్పటివరకు 400 మందికి సంబంధింత బ్యాంకుల నుంచి ఏటీఎం కార్డులు ఇప్పించాం. త్వరలోనే మిగతా వారికి కూడా అందిస్తాం అని తెలిపారు. ఇక జైలులో ఖైదీలు ప్రతి రోజు 4-8 గంటలు పని చేస్తుంటారు. ఇందుకు గాను వీరికి 52-103 రూపాయల వేతనం చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని ఖైదీల చేతికి ఇవ్వకుండా అకౌంట్‌లో జమ చేస్తారు. ఇక జైలులో లోపల కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఒకవేళ అవి అమల్లోకి వస్తే ఖైదీల వేతనం 112-156 రూపాయలకు పెరగనుంది. ఇక జైలులో ఖైదీలు తమ చేతిలో 500 రూపాయలు వరకు ఉంచుకోవచ్చు. (చదవండి: వామ్మో.. ఏటిఎం?)

జనవరి 2019 వరకు, ఖైదీల వేతనాలను చెక్కుల ద్వారా చెల్లించేవారు. ప్రస్తుతం డబ్బును వారి ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. జైలు గేటు వద్ద ఏటీఎం ఏర్పాటు చేస్తే.. ఖైదీలకు డబ్బులు ఇవ్వడానికి వచ్చే వారిని సంఖ్యను చాలా వరకు తగ్గించవచ్చు. ఏటీఎం ఏర్పాటు చేయడం ద్వారా ఖైదీలు జైలులో పని చేసినందుకు లభించే వేతనం నుంచి తమకు అవసరమైన నూనె, సబ్బులు, పండ్లు, స్నాక్స్‌ వంటి రోజువారీ వినియోగ వస్తువులను కొనుగోలు చేయడానికి కార్డు ఉపయోగించి డబ్బు డ్రా చేసుకుంటారు అని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు