ఎన్నికల్లో ఓడినా.. సీఎంగా ఆయనే!

21 Mar, 2022 19:42 IST|Sakshi

సాక్షి డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి సీఎం ఎవరంటూ...గత 11 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. మళ్లీ ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా పుష్కర్ సింగ్ ధామి కొనసాగుతారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు సోమవారం డెహ్రాడూన్‌లో జరిగిన బీజెపీ శాసనసభా పక్షం సమావేశం తదనంతరం రాజ్‌నాథ్ సింగ్‌ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీజెపీ నాయకులు, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీనియర్ నాయకురాలు మీనాక్షి లేఖి తదితరలు పాల్గొన్నారు.

ఈ క్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ..పుష్కర్ సింగ్ ధామి శాసనసభా పక్ష నాయకుడిగా ప్రకటిస్తున్నాం. నేను ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన నాయకత్వంలో ఉత్తరాఖండ్ వేగంగా అభివృద్ధి చెందుతుందని నేను విశ్వసిస్తున్నాను" అని పేర్కొన్నారు. ఇటీవల ముగిసిన ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 46 సీట్లు గెలుచుకుని వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఉదంసింగ్ నగర్ జిల్లాలోని ఖతిమా నియోజకవర్గం నుంచి పుష్కర్ సింగ్ ధామి ఓడిపోయారు.

2012, 2017లో ఇక్కడి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన పుష్కర్ సింగ్ ధామి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భువన్ చంద్ర కప్రీ చేతిలో 6 వేల మెజార్టీ ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఆయన మార్చి 11న ఉత్తరాఖండ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ భారీ విజయానికి ధామీని చేసిని కృషి బీజెపీ నాయకులు అభిమానాన్ని చూరగొంది. అదే ఆయనను మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రకటించేలా చేసింది. అయితే ఈ అత్యున్నత పదవీ కోసం దాదాపు అరడజను మంది పేర్లు తెరపైకి వచ్చాయి కానీ వారందరీలో పుష్కర్ సింగ్ ధామి పేరే అధికంగా వినిపించడంతో ఓడిపోయినప్పటికీ.. మళ్లీ సీఎంగా ఐదేళ్లు పదవిలో కొనసాగే ఛాన్స్‌ కొట్టేశారు.

(చదవండి: ఆర్‌జేడీలో ఎల్‌జేడీ విలీనం)

మరిన్ని వార్తలు