తొలిసారి లక్షద్వీప్‌లో నీలి తిమింగలం పాట రికార్డు

3 Jul, 2021 12:44 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నైరుతి రుతుపవన కాలంలో లక్షద్వీప్‌లో సంచరిస్తున్న పిగ్మి నీలి తిమింగలాలు

న్యూఢిల్లీ: లక్షద్వీప్‌లో పిగ్మి నీలి తిమింగలాలున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. తాజాగా లక్షద్వీప్‌లో తొలిసారి పిగ్మి నీలి తిమింగలం పాట రికార్డ్‌ చేసినట్లు తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్‌ ఓషనోగ్రఫీలో పీహెచ్‌డీ చేస్తున్న దివ్య పానికర్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఈమె గత ఆరు సంవత్సరాలుగా తిమింగలాల మీద పరిశోధనలు చేస్తున్నారు. కేరళకు చెందిన దివ్య పానికర్‌ 2015లో తొలిసారి లక్షద్వీప్‌ను సదర్శించారు. ఆ సమయంలో ఆమె పలువురు జాలర్లును కలిసి మాట్లాడారు. వారిలో చాలామంది తాము లక్షద్వీప్‌లో పెద్ద పెద్ద తిమింగలాలను చూసినట్లు ఆమెకు చెప్పారు. దీనికంటే ముందే పలు శాస్త్రవేత్తల సమూహాలు హిందూ మహాసముద్రంలో అంతరించిపోతున్న పలు జాతులకు చెందిన జీవజాతులున్నట్లు వెల్లడించారు. అయితే ఇవన్ని ఇక్కడే స్థిరంగా ఉండేవా.. లేక వలస వచ్చినవా అనే దాని గురించి చెప్పలేకపోయారు. 

ఈ క్రమంలో గత ఆరేళ్లుగా ఇక్కడ పరిశోధనలు చేస్తున్న దివ్య పానికర్‌ వీటిలో కొన్ని ప్రశ్నలకు సమాధానం కనుగొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘తొలిసారి ఈ నీటిలో పిగ్మి నీలి తిమింగాలాల పాట రికార్డు చేశాం. ఇక లక్షద్వీప్‌లో ఇవి ఉన్నాయనే దానికి నిదర్శనం ఈ పాట’’ అన్నారు. ‘‘గత కొన్నేళ్లుగా సాంకేతిక రంగంలో జరిగిన అభివృద్ధి ఈ పరిశోధనకు చాలా మేలు చేసింది. ధ్వని తరంగాలను గుర్తించడం ద్వారా స్వరం ఉన్న సముద్ర క్షీరదాలను గుర్తించగల్గుతాం. తిమింగలాల కదలికలను గమనించడం చాలా కష్టం. ఇవి ఎక్కువ దూరం ‍ప్రయాణం చేయడమే కాక.. నీటి లోపల ఎక్కువ సమయం ఉంటాయి. అందుకే ధ్వని దార్వా వీటిని గుర్తిస్తాం. యూనివర్శిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లో నేను ధ్వని ద్వారా సముద్ర క్షీరదాల జనాభా, పంపకాన్ని ఎలా లెక్కించవచ్చు అనే దాని గురించి నేర్చుకున్నాను’’ అని దివ్య పానికర్‌ తెలిపారు. 

‘‘ఈ పరిశోధనల కోసం నేను డిసెంబర్‌, 2018లో సముద్రం లోపలికి వెళ్లి తిమింగలాలు చేసే ధ్వనిని రికార్డ్‌ చేయడం కోసం కవరత్తి ద్వీపం రెండు చివర్ల మైక్రోఫోన్స్‌ అమర్చి వచ్చాను. వీటిని విశ్లేషించగా.. ఏప్రిల్‌-మే నెలల మధ్య వీటి కార్యకలాపాలు గరిష్టంగా ఉన్నట్లు తెలిసింది. పిగ్మి నీలి తిమింగలం పాటలు నైరుతి రుతుపవన కాలమైన ఏప్రిల్‌-మేలో గరిష్టంగా ఉంటున్నాయి. దీన్ని బట్టి.. పిగ్మి నీలి తిమింగలాలు లక్షద్వీప్‌ ప్రాంతాన్ని కాలాల వారిగా వాడుకుంటున్నట్లు తెలిసింది’’ అన్నారు దివ్య పానికర్‌. 1960-70 కాలంలో సోవియట్‌ వేలింగ్‌ రికార్డు ప్రకారం లక్షద్వీప్‌ ప్రాంతలో నీలి తిమింగలాలున్నట్లు వెల్లడించింది. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు