పక్షుల్లా వచ్చేశాయ్‌

30 Jul, 2020 03:43 IST|Sakshi
రఫేల్‌ ఎదుట పైలట్లతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ భదౌరియా తదితరులు

అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకున్న రఫేల్‌ యుద్ధ విమానాలు

దేశ భద్రతకు మించిన యజ్ఞం లేదన్న ప్రధాని

చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ నిప్పులు చిమ్ముకుంటూ పిడుగులు కురిపించేందుకు  శత్రువుల్ని గాలిదుమారంలా చుట్టేయడానికి మన దేశ వాయుసేనకు మరింత సత్తా చేకూర్చేలా  జాతి యావత్తూ ఎదురుచూపులు ఫలించేలా ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన రఫేల్‌ యుద్ధ విమానాలు రెక్కలు కట్టుకొని మరీ పక్షుల్లా వాలిపోయాయి.

అంబాలా: రెండు రోజుల క్రితం ఫ్రాన్స్‌ నుంచి బయల్దేరిన అయిదు రఫేల్‌ యుద్ధ విమానాలు ఏడు వేల కి.మీ.లు ప్రయాణించి బుధవారం మధ్యాహ్నం హరియాణాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరుకున్నాయి. రఫేల్‌ విమానాలు భారత్‌ గగనతలంలోకి ప్రవేశించగానే రెండు సుఖోయ్‌–30 యుద్ధ విమానాలు వాటికి ఎదురేగి వెంట వచ్చాయి. చీఫ్‌ ఆఫ్‌ ఎయిర్‌ స్టాఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ భదౌరియాతో పాటుగా భారత వైమానికి దళానికి చెందిన ఉన్నతస్థాయి అధికారులు అంబాలా ఎయిర్‌బేస్‌లో స్వాగతం పలికారు.  సంప్రదాయ బద్ధమైన వాటర్‌ కెనాన్లతో విమానాలకు సెల్యూట్‌ కార్యక్రమం నిర్వహించారు.  

శత్రువుల వెన్నులో వణుకు: రాజ్‌నాథ్‌
రఫేల్‌ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్‌బేస్‌కు చేరుకోగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ ట్వీట్లు చేశారు. పక్షులు సురక్షితంగా దిగాయంటూ ట్వీట్‌ చేశారు.  చైనాకు హెచ్చరికలు పంపారు. మన ప్రాదేశిక సమగ్రతకు ముప్పు కలిగించాలనుకునే వారికి రఫేల్‌ రాకతో వెన్నులో వణుకు పుడుతుందని అన్నారు. భారత్‌ భూభాగంలోకి రఫేల్‌ యుద్ధవిమానాలు దిగడం మన దేశ సైనిక చరిత్రలో నవ శకానికి నాందిగా అభివర్ణించారు.

యుద్ధ విమానాల్లో క్షిపణులు, ఆయుధాలు, రాడార్లు, ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని రాజ్‌నాథ్‌ తన ట్వీట్‌లో వివరించారు. రఫేల్‌ యుద్ధ విమానాల రాక దేశానికే గర్వకారణమని హోం శాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఫ్రాన్స్‌లోని దసో ఏవియేషన్‌ తయారు చేసిన 36 రఫేల్‌ యుద్ధ విమానాలను రూ. 59 వేల కోట్లకు కొనుగోలు చేయడానికి 2016లో ఎన్డీయే ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే.  మరోవైపు, రఫేల్‌ యుద్ధ విమానాల రావడంపై భారత వాయుసేనకి రాహుల్‌ గాంధీ అభినందనలు తెలియజేశారు. ఒక్కో యుద్ధ విమానంపై రూ.526 కోట్లకు బదులుగా రూ.1670 కోట్లు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

సంస్కృతంలో ప్రధాని ట్వీట్‌  
యుద్ధ విమానాలకు స్వాగతం చెప్తూ ప్రధాని మోదీ సంస్కృతంలో ట్వీట్‌ చేశారు. ‘జాతి రక్షణకు మించిన ధర్మం లేదు. దేశ భద్రతకు మించిన అత్యుత్తమ యజ్ఞం లేదు’ అని అన్నారు. కీర్తి ప్రతిష్టలతో సమున్నతంగా ఆకాశాన్ని తాకాలని ఆకాక్షించారు.

ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మరిన్ని వార్తలు