‘గోల్డెన్‌‌ గర్ల్‌’ శివాంగి సింగ్‌

23 Sep, 2020 14:41 IST|Sakshi

న్యూఢిల్లీ: వైమానిక దళంలో చేరిన అత్యాధునిక రఫేల్‌ ఫైటర్‌ జెట్ల దళంలోకి అడుగుపెట్టనున్న మహిళా పైలట్‌ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. అంబాలా కేంద్రంగా పనిచేసే ‘గోల్డెన్‌ యారోస్‌’ 17 స్క్వాడ్రన్‌లోకి ఎంపికైన తొలి మహిళగా ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ శివాంగి సింగ్‌ చరిత్ర సృష్టించారు. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా శివాంగికి అభినందనలు తెలుపుతూ.. ‘‘దేశమంతా నిన్ను చూసి గర్విస్తోంది’’ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా వారణాసికి చెందిన శివాంగి 2017లో భారత వైమానిక దళంలో చేరారు. మిగ్‌-21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఆమె సొంతం. రాజస్తాన్‌ బార్డర్‌ బేస్‌లో అభినందన్‌ వర్ధమాన్‌తో కలిసి ఫైటర్‌ జెట్లు నడిపిన శివాంగి త్వరలోనే రఫేల్‌  స్క్వాడ్రన్‌లో చేరేందుకు అంబాలాలో అడుగుపెట్టనున్నారు. (చదవండి: నావికా నాయికలు)

ఇక వారణాసిలో ప్రాథమిక విద్యనభ్యసించిన శివాంగికి చిన్ననాటి నుంచే వైమానిక దళంలో చేరాలని కలలు కనేవారు. బెనారస్‌ హిందూ యూనివర్సిటీలో చేరిన అనంతరం తన ఆశయాన్ని నెరవేర్చుకునే దిశగా అడుగులుపడ్డాయి. అక్కడే నేషనల్‌ క్యాడెట్‌ కార్స్ప్‌ 7 యూపీ ఎయిర్‌ స్వాడ్రాన్‌లో భాగస్వామ్యమయ్యే అవకాశం లభించింది. ఈ క్రమంలో 2016లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో చేరి శిక్షణ ప్రారంభించారు. కాగా భారత్‌- చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో రఫేల్‌ ఫైటర్‌ జెట్లు తూర్పు లద్ధాక్‌లో విధుల్లో పాల్గొంటున్నాయి. ఇక ఫ్రాన్సులో తయారైన 5 రఫేల్‌ ఫైటర్‌ జెట్లు ఈనెల 10న అంబాలా వైమానిక స్థావరం కేంద్రంగా పనిచేస్తున్న గోల్డెన్‌ యారోస్‌ స్క్వాడ్రన్‌లో అధికారికంగా చేరిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు