మీడియాతో మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తాం

22 May, 2021 03:36 IST|Sakshi

టీవీ, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో ఇంటర్వ్యూలు ఇవ్వొద్దు

దర్యాప్తు అధికారి పిలిస్తే స్వయంగా హాజరుకావాలి

రఘురామకు షరతులతో కూడిన బెయిల్‌ ఇచ్చిన సుప్రీం కోర్టు

సీబీఐ విచారణకు అంగీకరించని ధర్మాసనం

గాయాలు ఎలా వచ్చాయో ఆర్మీ నివేదికలో లేదు: దవే

సీబీఐ విచారణకు ఆదేశాలివ్వాలి: రోహత్గి 

సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ కె.రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. టీవీ, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో కేసు విషయం మాట్లాడితే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. కస్టడీలోకి తీసుకొనేంతగా అభియోగాలు మోపలేదని, పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితిని(డిసెంబరులో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న దృష్ట్యా) పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ మంజూరు చేస్తున్నామని తెలిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీబీఐ విచారణకు డిమాండ్‌ చేయగా.. ధర్మాసనం అనుమతించలేదు. హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ, బెయిల్‌ కోరుతూ రఘురామ, అతని కుమారుడు భరత్‌ దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను శుక్రవారం జస్టిస్‌ వినీత్‌ శరణ్, జస్టిస్‌ బీఆర్‌ గవాయిలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆర్మీ ఆస్పత్రి సీల్డ్‌ కవర్‌లో పంపిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది. ఎడమ కాలులో రెండో వేలు ఫ్రాక్చర్‌ అయిందని, జనరల్‌ ఎడెమా (నీరు పట్టడం) ఉందని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు నివేదిక ఇచ్చినట్టు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు.

ఆ గాయాలు ఎలా వచ్చాయో ఆర్మీ ఆస్పత్రి స్పష్టం చేయలేదు 
రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపిస్తూ.. ‘ఆర్మీ ఆస్పత్రి నివేదికతో మేం విభేదించడం లేదు. అయితే ఆ నివేదికలో గాయాలు ఎలా వచ్చాయో స్పష్టం చేయలేదు. మెడికల్‌ బోర్డు, ఆర్మీ ఆస్పత్రి పరీక్షల మధ్య ఏదో జరిగి ఉంటుంది. అవి స్వయంగా చేసుకున్న గాయాలు అని ఎందుకు భావించకూడదు. ఆర్మీ ఆస్పత్రి నివేదిక అసంపూర్తిగా ఉంది. గాయం ఎలా అయిందో అందులో లేదు’ అని దవే స్పష్టం చేశారు. ‘రఘురామకృష్ణరాజు రెండువర్గాల మధ్య ద్వేషాన్ని కలిగించడానికే యత్నించారు. ఇది ప్రజల్లో అసమానతలకు కారణమైంది. రెండు వైద్య నివేదికల మధ్య ఏదో జరిగింది. రఘురామ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేయండి. పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. బాహ్య గాయాలేమీ లేవు. అఖిల్‌ గొగొయ్, సిద్ధిఖ్‌ కప్పన్‌ కేసులు కూడా రాజద్రోహం కేసులే. సుప్రీంకోర్టు ఈ కేసుల్లో బెయిల్‌ మంజూరు చేయలేదు. గాయాలు ఉన్నాయన్న ఒక్క కారణంతో పిటిషనర్‌కు బెయిల్‌ ఇవ్వడం సరికాదు’ అని దవే ధర్మాసనానికి నివేదించారు. ‘బాధ్యత కలిగిన వ్యక్తి ఇంకా బాధ్యతగా ఉండాలని సుప్రీంకోర్టు గతంలో చెప్పింది. రఘురామకృష్ణరాజు కులాలు, మతాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 124ఏ దుర్వినియోగం చేశారనడం సరికాదు. క్రిస్టియన్లు అధికారంలో ఉన్నారు. హిందువులకు వ్యతిరేకం అంటూ ప్రకటనలు చేశారు. పిటిషనర్‌ హద్దులు మీరి ప్రవర్తించారు. రెడ్డి, క్రిస్టియన్లను లక్ష్యంగా చేసుకుని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు’ అని దవే పేర్కొన్నారు.

ఆ మధ్యలో ఏదో జరిగింది
‘పిటిషనర్‌ కోరిన మీదట హైకోర్టు ఆదేశాలతో ఏర్పడిన మెడికల్‌ బోర్డు రఘురామకృష్ణరాజుకు క్షుణ్ణంగా పరీక్షలు చేసింది. ఆర్మీ నివేదిక తప్పు అనడం లేదు. రెండు పరీక్షల మధ్య సమయంలో ఏదో జరిగింది. రెండు నివేదికలు విశ్వసించదగినవే. మెడికల్‌ బోర్డు పరీక్షలను హైకోర్టు పరిశీలించింది. నివేదికలో గాయాలు లేవని తెలిపింది’ అని దవే వివరించారు. కాలి రెండో వేలికి ఫ్రాక్చర్‌ అయిందని ఆర్మీ నివేదిక చెబుతోందిగా అని ధర్మాసనం ప్రశ్నించగా.. ‘మెడికల్‌ బోర్డు పరీక్షల్ని వీడియో తీశారు. రిజిస్ట్రీకి ఇచ్చారు. మెడికల్‌ బోర్డు, ఆర్మీ వైద్యుల పరీక్షలకు మధ్య గ్యాప్‌లో ఏదో జరిగింది. అన్‌డిస్‌ప్లేస్‌డ్‌ ఫ్రాక్చర్‌ అంటే బోన్‌ ఫ్రాక్చర్‌ కాదు. అది ఎప్పుడు జరిగింది. పాతదా కొత్తదా అనేది ఆర్మీ ఆస్పత్రి నివేదికలో లేదు. పోలీసులు కొడితే రెండో వేలు ఒక్క దానికే గాయం అవుతుందా. పోలీసులు ఏయే మెథడ్స్‌ ఉపయోగిస్తారో మీకు, నాకు కూడా తెలుసు. ఎంపీతో అలా వ్యవహరించరు. అంబులెన్స్‌లో కాకుండా సొంత కారులో ఆర్మీ ఆస్పత్రికి వెళ్తానంటే పిటిషనర్‌ను అనుమతించాం. వాహనంలో వెళ్తూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ.. పాదాలు బయటకు పెట్టి అందరికీ చూపారు. ఆ దృశ్యాలు మీడియా, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రసారం అయ్యాయి. ఆర్మీ ఆస్పత్రికి తరలించే ప్రక్రియను హాస్యాస్పదం చేశారు. జ్యుడిషియల్‌ కస్టడీలో తనని కొట్టారని, చంపేస్తారని భయంగా ఉందంటూ మీడియాతో వ్యాఖ్యలు చేశారు’ అని దవే స్పష్టం చేశారు.

రాష్ట్రపతి పాలన కూడా పెట్టమంటారు
‘పిటిషనర్‌ తరఫు న్యాయవాది సీబీఐ విచారణ అడుగుతున్నారు. కాలి రెండో వేలికి గాయమైతే సీబీఐ విచారణ కోరతారా. పిటినషర్‌ తరఫు న్యాయవాదిని ఇలాగే అనుమతిస్తే.. రాష్ట్రపతి పాలన కూడా విధించాలని కోరతారు’ అని వ్యాఖ్యానించిన దవే ఇలాంటి కేసులను సీబీఐకి పంపాల్సిన అవసరం లేదన్నారు. 

దర్యాప్తు అధికారి పిలిస్తే విచారణకు వెళ్లాలి
రఘురామకృష్ణరాజు తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి, వాదనలు వినిపించగా.. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం పిటిషనర్‌ ఆరోగ్య పరిస్థితి పరిగణనలోకి తీసుకుని షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది. రఘురామకృష్ణరాజు దర్యాప్తునకు సహకరించాలని, దర్యాప్తు అధికారి పిలిస్తే స్వయంగా విచారణకు హాజరుకావాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏ అంశంపైనా టీవీ, ప్రింట్, సామాజిక మాధ్యమాల్లో మాట్లాడకూడదని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని షరతు విధించింది. గతంలో మాదిరిగా గాయాలను ఎక్కడా ప్రదర్శించకూడదని, షరతుల్ని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేసింది. సొంత పూచీకత్తు, ఇద్దరు జామీనుదారులతో రూ.లక్ష ష్యూరిటీ బాండ్లు ఇచ్చి బెయిలు పొందొచ్చని పేర్కొంది. ఇదిలావుండగా.. రఘురామను ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలన్న మేజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాలు పాటించలేదంటూ హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాదులు దవే, వి.గిరి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ అలాంటి నోటీసులు జారీ అయితే ముందుగా సుప్రీంకోర్టులో ఆ అంశం మెన్షన్‌ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛనిస్తున్నామని ధర్మాసనం స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు