-

Raghu Rama Krishnam Raju: ‘అన్ని పరిధులు దాటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు’

21 May, 2021 18:07 IST|Sakshi

రఘురామకృష్ణరాజు కేసుపై సుప్రీంకోర్టులో దవే వాదనలు

సాక్షి, న్యూఢిల్లీ: రఘురామకృష్ణరాజు కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌ ఆర్మీ ఆస్పత్రిలో ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షలకు సంబంధించిన నివేదిక వివరాలు వెల్లడయ్యాయి. ఆర్మీ  ఆస్పత్రి మెడికల్‌ రిపోర్టు ప్రకారం.. రఘురామకృష్ణరాజుకు సాధారణ ఎడిమా ఉంది. ఆయన ఎడమ కాలి రెండో వేలుపై పగులు ఉంది.

ఇక ఈ కేసులో సుప్రీంకోర్టు ఎదుట హాజరైన సీఐడీ లాయర్‌ దుష్యంత్‌ దవే మాట్లాడుతూ.. ‘‘రఘురామకృష్ణరాజు గాయాలపై అనుమానాలున్నాయి. ఆయన తనకు తానుగా చేసుకున్న గాయాలనే సందేహం ఉంది. ఆర్మీ ఆస్పత్రికి వచ్చేప్పుడు ఆయన ఏం చేశారో పరిశీలించాలి’’అని పేర్కొన్నారు. ఆర్మీ ఆస్పత్రి నివేదికను సీఐడీకి అందిస్తామని తెలిపారు. ఇక ఈ కేసులో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు వాదనలు వింటామని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది.

UPdate: సీనియర్‌ అడ్వొకేట్‌ దవే వాదనలు
రఘురామకృష్ణరాజు కేసులో లాయర్‌ దుష్యంత్‌ దవే తన వాదనలు వినిపిస్తూ... ‘‘ఆర్మీ ఆస్పత్రి నివేదిక అస్పష్టంగా ఉంది. లోతైన గాయాలున్నట్టు నివేదికలో పేర్కొనలేదు. రఘురామకృష్ణరాజు బెయిల్‌ పిటిషన్‌ను తక్షణం డిస్మిస్‌ చేయాలి. గుజరాత్‌ సొసైటీ కేసును దృష్టిలో ఉంచుకుని ఈ పిటిషన్‌ను కొట్టివేయాలి. బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించిన హైకోర్టును తప్పుపట్టకూడదు. నిజానికి తను చేసిన వ్యాఖ్యలపై రఘురామకృష్ణరాజు వెనక్కి తగ్గలేదు. రాజద్రోహానికి సంబంధించి మొత్తం 11 అంశాలు ఉన్నాయి.

తప్పు జరిగిందా? లేదా? అనేదాన్నే కోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. తన వ్యాఖ్యలతో రఘురామకృష్ణరాజు కులాల మధ్య చిచ్చుపెట్టే పని చేశారు. పార్లమెంటు సభ్యుడిగా, ఒక వ్యక్తిగా వర్గాల మధ్య చిచ్చు పెట్టారు. ఒక ఎంపీ చేసే వ్యాఖ్యలు ఇంకా ఎక్కువ తీవ్రత చూపిస్తాయి. కోవిడ్‌లాంటి ఆపత్కాలంలో ఘర్షణలు చెలరేగేలా వ్యాఖ్యలు చేశారు. ఆయన తప్పు సరిదిద్దుకుంటారని ప్రభుత్వం చాలా సమయం ఇచ్చింది. కానీ, రఘురామకృష్ణరాజు అన్ని పరిధులు దాటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ దశలో.. ఈ రాజద్రోహం కేసులో కోర్టు జోక్యం చేసుకోవద్దు’’ అని న్యాయస్థానానికి విన్నవించారు.

ఈ సందర్భంగా... సుప్రీంకోర్టుకు సీఐడి సీనియర్‌ అధికారి రిపోర్టును సమర్పించిన దవే.. ‘‘రఘురామ వ్యాఖ్యలకు సంబంధించి 45 వీడియోలున్నాయి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేశారు. ఒకరిని ఒకరు చంపుకొనే విధంగా రఘురామ మాట్లాడారు’’ అంటూ రఘురామ రెచ్చగొట్టే వ్యాఖ్యలను కోర్టుకు చదివి వినిపించారు. అదే విధంగా... ‘‘ఒక కులానికే వ్యాక్సినేషన్‌ చేస్తున్నారని రఘురామ తప్పుడు ప్రచారం చేశారు.  ప్రభుత్వ వాలంటీర్లను తన్నాలంటూ రఘురామ పిలుపునిచ్చారు. ఎంత పెద్ద పదవిలో ఉంటే అంత బాధ్యతగా ఉండాలని కోర్టు చెప్పింది. 

రఘురామకృష్ణరాజు ఎంపీ కాబట్టి బెయిల్‌ ఇవ్వాలని రోహత్గీ అంటున్నారు. 4 సార్లు ఎంపీ అయినంత మాత్రాన బెయిల్‌ ఇవ్వలేమని 2017లో కోర్టు చెప్పింది. ఎంపీ అయినంత మాత్రాన హైకోర్టును దాటి సుప్రీంకోర్టుకు వస్తారా?’’ అని తన వాదనలు వినిపించారు. కాగా రఘురామకృష్ణరాజును కస్టడీలో కొట్టారన్న ఆరోపణలు అవాస్తవమని ఇప్పటికే దవే కోర్టుకు తెలిపిన విషయం తెలిసిందే. 

సొంతకారులో రఘురామ ప్రయాణించిన దృశ్యాలు కోర్టుకు చూపించిన లాయర్‌ దవే
‘‘గుంటూరు వైద్యుల రిపోర్టు, ఆర్మీ వైద్యుల రిపోర్ట్‌ వచ్చే మధ్య ఏదో జరిగి ఉంటుందనుకుంటున్నా. ఎడిమా అనేది చాలా మందికి వయసుతోపాటు వచ్చేదే. 
వై కేటగిరి భద్రత రఘురామకృష్ణరాజుకే కాదు కంగనా రనౌత్‌కూ ఉంది. రఘురామకృష్ణరాజు శరీరంపై ఎలాంటి గాయాలు లేవు. దీన్ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవాలి. రఘురామకృష్ణరాజు ఉన్నది పూర్తి సురక్షితమైన ఆర్మీ ఆస్పత్రిలోనే. అంబులెన్స్‌లో వెళ్లమంటే రఘురామకృష్ణరాజు సొంతకారులో వెళ్లారు. 

ప్రజలకు అభివాదం చేస్తూ.. కాళ్లు చూపిస్తూ వెళ్లారు. కాళ్ల రంగు మారడానికి కారణం ఎడిమా మాత్రమే కారణం. మే 17న తీసిన ఎక్స్‌రేలో రఘురామకృష్ణరాజు కాలికి ఎలాంటి గాయం లేదు. పోలీసులు నిజంగా కొట్టాలనుకుంటే ఎడమ కాలి రెండో వేలే దొరికిందా?. రఘురామకృష్ణరాజు ఆరోపణలు పూర్తిగా వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి. బెయిల్‌ కోసం రోజుకు కొన్ని వేలమంది కోర్టుకు వస్తారు. వేలికి చిన్న గాయం అయిందన్న సాకుతో ఇంత వేగంగా విచారణ జరగదు.

గుంటూరు జైలు నుంచి సికింద్రాబాద్‌ తరలిస్తుండగా.. రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను లాయర్‌ దవే కోర్టుకు తెలిపారు. కారులో కాలు పైకెత్తి రఘురామ చేసిన విన్యాసాల వీడియో కోర్టుకు సమర్పించారు. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాలతో సీఐడీ పోలీసులు తరలిస్తుంటే..కారులో రఘురామకృష్ణరాజు కాలు పైకెత్తి, ప్రకటనలు చేస్తూ వస్తారా?. బెయిల్‌ పిటిషన్‌ కింది కోర్టులో దాఖలు చేసుకోమని హైకోర్టు చెప్పింది. బాగా డబ్బుంది కాబట్టే రోహత్గీ లాంటి పెద్ద లాయర్‌ను పెట్టుకున్నారు.

డబ్బు, పలుకుబడి ఉంది కాబట్టే సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. అన్యాయం జరుగుతుంటే కోర్టు కళ్లు మూసుకుని ఉండకూడదు. అలాగని కళ్లు మరీ పెద్దవి చేసుకుని చూడకండి. సెక్షన్‌ 136 కింద సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవద్దు. రఘురామకృష్ణరాజు వ్యాఖ్యలు చిన్నవిగా చూడకూడదు. కోవిడ్‌ వాలంటీర్లను తన్నాలన్న వ్యాఖ్యలు మామూలివి కావు. కులాలు, మతాల మధ్య విద్వేషాలు రగిల్చే వ్యాఖ్యలు చేశారు.

ఈ కేసును వేరేగా ఎలా చూస్తారు?
ఇవే విద్వేషపూరిత వ్యాఖ్యలు సాధారణ వ్యక్తి చేసి ఉంటే.. కోర్టు ఒక్క సెకను కూడా ఆయన వాదన వినేది కాదు. మెరిట్‌ చూస్తే ఈ బెయిల్‌ పిటిషన్‌ వెంటనే కొట్టేయాలి. కింది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవాలి. రాజద్రోహం కేసులో బెయిల్‌ కోసం ఎందరో ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ అల్లర్లు, భీమాకోరేగావ్‌, హత్రాస్‌ కేసుల్లో చాలామంది ఎదురుచూస్తున్నారు.. వాళ్లకు బెయిల్‌ ఇవ్వొద్దని రోహత్గీనే వాదిస్తున్నారు. బీమాకోరేగావ్‌ కేసు, ఈ కేసులో ఒకే తరహా రెచ్చగొట్టే వ్యాఖ్యలున్నాయి.

ఆ కేసులో రాజద్రోహం సరైందని కోర్టు చెప్పినప్పుడు...ఈ కేసును వేరేగా ఎలా చూస్తారు?. ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని బెయిల్‌ ఇచ్చే అవకాశం లేదు.గతంలో చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న బాబ్డే.. కేరళకు సంబంధించిన కేసులో.. బెయిల్‌ కోసం హైకోర్టుకు వెళ్లాలని సూచించారు. ఇటీవల అసోంలో జైలు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిల్‌ గొగోయ్‌.. బెయిల్‌ పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు తిరస్కరించింది. విచారణాధికారిపై హైకోర్టు ధిక్కరణ నోటీసు సస్పెండ్‌ చేయాలి’’ అని లాయర్‌ దవే న్యాయస్థానానికి విన్నవించారు.

చదవండి: రఘురామకృష్ణంరాజు కేసు: కొట్టారన్నది కట్టు కథే
సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుపత్రికి రఘురామకృష్ణరాజు

మరిన్ని వార్తలు