సరిహద్దు వివాదం : మోదీ సర్కార్‌ ఏ గట్టునుంది?

16 Sep, 2020 16:12 IST|Sakshi

కేంద్రంపై విరుచుకుపడిన రాహుల్‌

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు సాగుతుండగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దేశంలో లేకున్నా నరేంద్ర మోదీ సర్కార్‌పై విమర్శల దాడి కొనసాగిస్తున్నారు. భారత్‌-చైనా సరిహద్దు ప్రతిష్టంభనపై ట్విటర్‌ వేదికగా రాహుల్‌ బుధవారం మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. లడఖ్‌లో చైనా బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయని, అసలు దేశంలో ప్రభుత్వం భారత సైన్యంతో ఉందా చైనా వైపు ఉందా అని రాహుల్‌ మోదీ సర్కార్‌పై మండిపడ్డారు.

‘ సరిహద్దుల్లోకి ఏ ఒక్కరూ ప్రవేశించలేదని ప్రధానమంత్రి చెబుతారు..ఆ తర్వాత చైనా బ్యాంకు నుంచి భారీ రుణం తీసుకుంటారు..ఆపై రక్షణమంత్రి చైనా మన భూభాగాన్ని ఆక్రమించిందని చెబుతారు..ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రేమో ఎలాంటి ఆక్రమణలు లేవని చెపుతున్నారని ఈ వరుస పరిణామాలను గమనించాల’ని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. అసలు మోదీ ప్రభుత్వం భారత సైన్యంతో ఉందా లేక చైనా వెంట ఉందా..? ఎందుకంతగా భయపడుతున్నారని ప్రశ్నించారు. తన తల్లి సోనియా గాంధీ ఆరోగ్య పరీక్షల నిమిత్తం రాహుల్‌ గాంధీ ఆమెతో కలిసి విదేశాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా సరిహద్దు పరిస్థితిపై మంగళవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో ప్రకటన చేస్తూ లడఖ్‌లో 38,000 కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా అక్రమంగా ఆక్రమించిందని ప్రకటించారు. చదవండి : ‘ఆత్మనిర్భర్‌ అంటే ఎవరిని వారు కాపాడుకోవడమే’

మే నుంచి ఎల్‌ఏసీని దాటేందుకు పలు ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. ఇక గత ఆరునెలలుగా ఎల్‌ఏసీ వెంబడి ఎలాంటి చొరబాట్లు లేవని ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌లో పేర్కొంది. ఇక గల్వాన్‌ ఘర్షణల నేపథ్యంలో మన భూభాగంలోకి ఎవరూ అడుగుపెట్టలేదు..మన స్ధావరాల్లో పాగా వేయలేదని జూన్‌లో ప్రధానమంత్రి ప్రకటించగా, చైనా సరిహద్దులను దాటి మన భూభాగంలోకి చొచ్చుకువస్తేనే భారత సేనలు చైనా భూభాగంలోకి దూసుకువెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్‌ ప్రధాని వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపింది. ఇక ఇదే సమయంలో చైనా ప్రాబల్య ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంక్‌ (ఏఐఐబీ) నుంచి ప్రభుత్వం భారీగా రుణాలను పొందింది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు