తొలిసారి ఆ రాష్ట్ర పర్యటనకు.. భారీగా భద్రతా ఏర్పాట్లు

9 Dec, 2021 21:00 IST|Sakshi

సాక్షి, ముంబై: కాంగ్రెస్‌ జాతీయ నేత రాహుల్‌ గాంధీ, అఖిల భారతీయ కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీల మహారాష్ట్ర పర్యటన తేదీలు ఖరారైనట్లు రాష్ట్ర సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్‌ వడెట్టివార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ మేరకు ఈ నెల 14వ తేదీన ప్రియాంకా గాంధీ గడ్చిరోలికి, 28వ తేదీన రాహుల్‌ గాంధీ ముంబైకి రానున్నారని ఆయన తెలిపారు. సామాజిక కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర ప్రదేశ్‌ యువ కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి శివానీ వడెట్టివార్‌ గడ్చిరోలి జిల్లాకు చెందిన ఎనిమిదో తరగతి నుంచి కాలేజీ చదువుతున్న సుమారు 10 వేల మంది విద్యార్థులకు ఈ–సైకిళ్లు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఈ నెల 14వ తేదీన ప్రియాంకా గడ్చిరోలి జిల్లాకు రానున్నారని విజయ్‌ వడెట్టివార్‌ తెలిపారు.

చదవండి: (సుధా భరద్వాజ్.. జైలు నుంచి విడుదల)

ముఖ్యంగా ప్రియాంకా గాంధీ తొలిసారి మహారాష్ట్ర పర్యటనకు రానుండటంతో ఏర్పాట్లు భారీగా చేస్తున్నారు. కాగా గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉంది. ఇటీవల పోలీసులు నిర్వహించిన కూంబింగ్‌ ఆపరేషన్‌లో అనేక మంది మావోయిస్టులు హతమయ్యారు. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు సమయం కోసం మావోయిస్టులు ఎదురు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ఉంది. దీంతో ప్రియాంకా గాంధీ పర్యటనలో ఎలాంటి విఘాతం కలగకుండా వివిధ రకాల భద్రతా దళాలతోపాటు భారీగా పోలీసు బలగాలను మోహరించనున్నారు.   

చదవండి: (Tejashwi Yadav: ఘనంగా తేజస్వి యాదవ్‌ వివాహం)

మరిన్ని వార్తలు