న్యాయం జరిగేదాకా పోరుబాటే

4 Oct, 2020 02:33 IST|Sakshi
బాధితురాలి కుటుంబ సభ్యుల్ని కలిసేందుకు హాథ్రస్‌ వైపు వెళ్తున్న రాహుల్‌

హాథ్రస్‌ ఘటనపై రాహుల్‌ గాంధీ, ప్రియాంక స్పష్టీకరణ 

దళిత యువతి కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్‌ నేతలు 

కిరాతకంపై సీబీఐ విచారణకు ఆదేశించిన ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం

లక్నో/హాథ్రస్‌/న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌ గ్రామంలో కామాంధుల కిరాతకానికి బలైపోయిన 19 ఏళ్ల దళిత యువతి కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేదాకా తమ పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ తేల్చిచెప్పారు. శనివారం వారు హాథ్రస్‌లో బాధితురాలి కుటుంబ సభ్యులను ఆమె ఇంట్లో  పరామర్శించారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అన్యాయానికి వ్యతిరేకంగా.. బిడ్డను కోల్పోయిన బాధిత కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాడుతామని ప్రియాంక అన్నారు. బాధితుల గొంతును ఎవరూ నొక్కలేరని రాహుల్‌ అన్నారు. రాహుల్, ప్రియాంక రాక సందర్భంగా హాథ్రస్‌లో బాధిత యువతి ఇంటి వద్దకు భారీగా జనం చేరుకున్నారు.  కాగా, హత్యాచార ఘటనపై సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి యోగి ఆదేశించారు.

ఢిల్లీ–యూపీ సరిహద్దులో హైడ్రామా  
ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌ సరిహద్దులోని ఢిల్లీ–నోయిడా డైరెక్టు ఫ్లైవే(డీఎన్‌డీ) వద్ద శనివారం హైడ్రామా చోటుచేసుకుంది. ఢిల్లీకి 180 కిలోమీటర్ల దూరంలోని హాథ్రస్‌కు వెళ్లి, బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి కాంగ్రెస్‌ నేతలు రాహుల్, ప్రియాంకా అక్కడికి చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ కార్యకర్తలు అక్కడికి రావడం, పోలీసులు భారీగా మోహరించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, కేకలతో ఆ ప్రాంతం హోరెత్తిపోయింది. చివరకు, కోవిడ్‌ నిబంధనల దృష్ట్యా రాహుల్, ప్రియాంకసహా ఐదుగురు కాంగ్రెస్‌ నేతలనే హాథ్రస్‌కు వెళ్లడానికి యూపీ పోలీసులు అంగీకరించారు. దీంతో శనివారం సాయంత్రం వారు తమ వాహనాల్లో ముందుకు కదిలారు. మరోవైపు హాథ్రస్‌ చుట్టూ ఉన్న బారికేడ్లను పోలీసులు శనివారం తొలగించారు. ఆంక్షలను ఎత్తి వేశారు.

గ్రామంలోకి మీడియా ప్రతినిధులను వెళ్లనిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ అదనపు చీఫ్‌ సెక్రెటరీ(హోం) అవనీశ్‌ అవస్తి, డీజీపీ హెచ్‌సీ అవస్తి కూడా శనివారం హాథ్రస్‌లో యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని, యువతి మరణానికి కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తుందని హామీ ఇచ్చారు.  వారణాసిలో శనివారం కేంద్ర మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ వాహన శ్రేణిని కాంగ్రెస్‌ కార్యకర్తలు అడ్డుకున్నారు. అనంతరం స్మతి ఇరానీ విలేకరులతో మాట్లాడారు.  హాథ్రస్‌ అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. దళిత యువతిపై జరిగిన కిరాతకం విషయంలో సాధారణ దర్యాప్తుతో ప్రజలు సంతృప్తి చెందడం లేదని బీఎస్పీ చీఫ్‌ మాయావతి చెప్పారు.

హాథ్రస్‌కు వెళ్లకుండా ప్రియాంక దుస్తులు పట్టుకుని అడ్డుకుంటున్న పోలీసు

మరిన్ని వార్తలు