అగ్నిపథ్‌తో దేశ భద్రత, యువత భవిష్యత్తు అంధకారం: రాహుల్‌ గాంధీ

24 Jul, 2022 13:13 IST|Sakshi

న్యూఢిల్లీ: త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై మరోమారు ఆరోపణలు గుప్పించారు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ల్యాబ్‌లో చేస‍్తున్న ఆ కొత్త ప్రయోగం ద్వారా దేశ భద్రత, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయన్నారు. ప్రతి ఏడాది 60 వేల మంది సైనికులు పదవీ విరమణ చెందితే.., అందులో కేవలం 3వేల మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు.

‘ప్రతి ఏటా 60వేల మంది జవాన్లు రిటైర్‌ అవుతున్నారు. అందులో 3వేల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారు. నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ తర్వాత రిటైర్‌ అయ్యే వేలాది మంది అగ్నివీర్‌ల భవిష్యత్తు ఏమిటి? ప్రధానమంత్రి ల్యాబోరేటరీలో చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ద్వారా దేశ భద్రతా, యువత భవిష్యత్తు ప్రమాదంలో పడ్డాయి.’ అని రాసుకొచ్చారు రాహుల్‌ గాంధీ.  

అగ్నిపథ్‌ పథకం ద్వారా త్రివిధ దళాల్లోకి అగ్నివీర్‌లను నాలుగేళ్ల కాంట్రాక్ట్‌ పద్ధతిన 17-21 ఏళ్ల అవివాహిత యువతను నియమిస్తామని కొద్ది రోజుల క్రితం కేంద్రం ప్రకటించింది. నాలుగేళ్ల తర్వాత అందులోని 25 శాతం మందిని సైన్యంలోకి తీసుకోనున్నట్లు తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. సికింద్రబాద్‌ సహా పలు చోట్ల రైళ్లకు నిప్పుపెట్టారు ఆందోళనకారులు. ఈ క్రమంలో వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచింది కేంద్రం. ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇప్పటికే వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు.

ఇదీ చదవండి: Agnipath: బంధాలను తెంచుతున్న అగ్నిపథ్‌

మరిన్ని వార్తలు