వలస కార్మికులు: మోదీ సర్కార్‌పై రాహుల్‌ మండిపాటు

15 Sep, 2020 13:02 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ మరోసారి నరేంద్రమోదీ సర్కార్‌పై  మండిపడ్డారు. లాక్‌డౌన్‌ సమయంలో ఎంత మంది వలస కార్మికులు మరణించారు, ఎంత మంది ఉపాధి కోల్పోయారు అనే విషయాన్ని పార్లమెంట్‌ వేదికగా కాంగ్రెస్‌ ప్రశ్నించింది. అయితే దీనికి లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని కోరగా ఆ సమయంలో ప్రభుత్వం ఎలాంటి రికార్డులు మెంటయిన్‌ చేయలేదని, ఆ లెక్కలు తమ వద్ద లేవని లేబర్‌ అండ్‌ ఎంప్లాయిమెంట్‌ మంత్రి సంతోష్‌ కుమార్‌ గాంగ‍్వర్‌ చెప్పారు. ఇక ఈ విషయంలో మోదీ సర్కార్‌ తీరుపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ విమర్శలు గుప్పించారు. 

ఎంత మంది వలస కార్మికులు ఉద్యోగాలు కోల్పోగా, ఎంత మందికి నష్టపరిహారం చెల్లించారు అని మరో ప్రశ్న సంధించింది. ఎంత మంది ఉపాధి పోగొట్టుకున్నారో తమ వద్ద లెక్కలు లేవని, ఇక నష్టపరిహారం అనే ప్రశ్నే ఇంత వరకు తమకు రాలేదని పేర్కొన్నారు. ఇక దీనిపై రాహుల్‌ గాంధీ స్పందిస్తూ, ‘మోదీ గవర్నమెంట్‌కు ఎంత మంది ఉద్యోగం కోల్పోయారో, ఎంత మంది చనిపోయారో తెలియదు. మీకు లెక్క తెలియదు అంటే ఎవరు చనిపోలేదని అర్థమా? ఎవరు ఉద్యోగం కోల్పోలేదని అనుకోవాలా? అని రాహుల్‌ ట్విట్టర్‌ వేదికగా ప్రశ్నించారు. కరోనా సమయంలో 63,07,000 మందికి పైగా వలసదారులను 4,611 శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల ద్వారా వివిధ గమ్యస్థానాలకు చేర్చారు.  ఒక సర్వే ప్రకారం 122 మిలియన్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. వీరిలో 75 శాతం మంది చిన్న వ్యాపారులు, రోజువారీ కూలీలు ఉన్నారు. 

చదవండి: ‘కరోనా చాలా నేర్పింది.. వ్యవసాయం చేస్తా’

మరిన్ని వార్తలు