Rahul Gandhi: ‘పోలీసు రాజ్యంగా మారిన దేశం.. దానికి మోదీనే కింగ్‌’

26 Jul, 2022 13:27 IST|Sakshi

న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో సోనియా గాంధీని ఈడీ విచారించటం సహా.. ధరల పెరుగుదల, జీఎస్టీ అంశాలపై ఢిల్లీలోని విజయ్‌ చౌక్‌ వద్ద ఆందోళనకు దిగింది కాంగ్రెస్‌. రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసనలు చేపట్టాయి. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీని చుట్టుముట్టిన పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున్‌ ఖర్గే, రంజీత్‌ రంజన్‌, కేసీ వేణుగోపాల్‌, మానికం ఠాగూర్‌, ఇమ్రాన్‌ ప్రతాప్‌గర్హి, కే సురేశ్‌లను సైతం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈడీ విచారణ నేపథ్యంలో ముందుగానే విజయ్‌ చౌక్‌, ఈడీ కార్యాలయాల ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం చేసి 144 సెక్షన్‌ విధించారు అధికారులు. అయినప్పటికీ కాంగ్రెస్‌ ఎంపీలు ర్యాలీ చేపట్టారు. సోనియా గాంధీతో ఈడీ కార్యాలయానికి వచ్చిన రాహుల్‌.. వారితో కలిసి నిరసనల్లో పాల్గొన్నారు. పోలీసులు అడ్డుకోవటంతో రోడ్డుపైనే బైఠాయించారు. ఈ సందర్భంగా కేంద్రం, ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు రాహుల్‌. ‘భారత్‌ ఒక పోలీసు రాజ్యంగా మారింది. ఆ రాజ్యానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కింగ్‌’ అని ఆరోపించారు రాహుల్‌. 

రాహుల్‌ గాంధీని పోలీసులు చుట్టుముట్టిన క్రమంలో సుమారు 30 నిమిషాల పాటు ఉద్రిక్త వాతావరణ నెలకొంది. అనంతరం రాహుల్‌ గాంధీని ఎత్తుకెళ్లి బస్సు ఎక్కించారు. అప్పటికే ఆయనతో ఉన్న పలువురు ఎంపీలను బస్సు ఎక్కించారు. ‘పోలీసుల సూచనల మేరకే నిరసనల్లో పాల్గొన్నాం. విపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టటం, మా గొంతులను నొక్కేసేందుకు ప్రధాని మోదీ, అమిత్‌ షాలు చేస్తున్న కుట్ర. దానికి మేము భయపడం. మా పోరాటం కొనసాగుతుంది. ’ అని తెలిపారు కాంగ్రెస్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే.

ఇదీ చదవండి: National Herald Case: రెండో రోజు ఈడీ ముందుకు సోనియా గాంధీ

మరిన్ని వార్తలు