ధరల దెబ్బతో అమాంతం పెరిగిన ‘జీడీపీ’ : రాహుల్‌

24 Jan, 2021 16:46 IST|Sakshi

మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ గాంధీ వ్యంగ్యాస్త్రాలు

న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ  ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలు ద్రవ్యోల్బణంతో బాధపడుతుంటే పన్నులు వసూలు చేయడంలో మోదీ ప్రభుత్వం బిజీగా ఉందని పేర్కొన్నాడు. ఇంధన ధరల పెరుగుదలతో జీడీపీ  (గ్యాస్-డీజిల్-పెట్రోల్) భారీగా వృద్ధిని కనబరిచిందని సెటైర్లు వేశారు. ఈమేరకు రాహుల్‌ ఆదివారం ట్వీట్‌ చేశారు. కాగా, దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్న విషయం తెలిసిందే. గడిచిన వారంలో నాలుగోసారి రేట్లు పెంచిన తరువాత దేశంలో శనివారం పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.(చదవండి: ఫ్యాక్ట్ చెక్: ఫిబ్ర‌వ‌రి 1 నుంచి సాధార‌ణ రైళ్లు)

పెట్రోల్ ప్రస్తుతం ఢిల్లీలో లీటరుకు రూ.85.70, ముంబైలో రూ.92,28గా ఉంది. అలాగే  డీజిల్ రేట్లు కూడా ఆకాశానికి చేరుకున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీలో ఒక లీటరు డీజిల్ ధర రూ.75,88 ఉండగా ముంబైలో లీటరుకు రూ.82,66గా ఉంది. ఈ వారంలో లీటరుకు రూ.1పైగా పెరిగింది. అలాగే హైదరాబాద్ లో పెట్రోల్ ధర రూ.89.15, డీజిల్ ధర రూ.82.80గా ఉంది. చమురు ధరల పెరుగుదలకు ప్రధాన కారణం సౌదీ చమురు ఉత్పత్తిని తగ్గించడమే అని కారణమని కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. కరోనా వైరస్ కారణంగా, చమురు ఉత్పత్తి చేసే అనేక దేశాలు ఉత్పత్తిని నిలిపివేసాయి లేదా తగ్గించాయి. డిమాండ్, సరఫరాలో అసమతుల్యత కారణంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి అని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు