కాంగ్రెస్‌ కార్యకర్తకు చేదు అనుభవం.. రాహుల్‌ చేసిన పనికి బీజేపీ కౌంటర్‌!

21 Dec, 2022 14:36 IST|Sakshi

దేశంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ భారత్‌ జోడో యాత్ర తలపెట్టిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. జోడో యాత్రలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో రాహుల్‌ యాత్ర ముగిసింది. ప్రస్తుతం రాజస్థాన్‌లో జోడో యాత్ర కొనసాగుతోంది. అయితే, రాహుల్‌ యాత్రపై అటు బీజేపీ కూడా ఫోకస్ పెట్టింది. యాత్రలో జరుగుతున్న చిన్న తప్పిదాలను ఎత్తిచూపుతూ బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలకు దిగుతున్నారు. 

తాజాగా అలాంటి ఘటనే భారత్‌ జోడో యాత్రలో చోటుచేసుకుంది. రాహుల్‌ గాంధీ చేసిన పనిని బీజేపీ హైలైల్‌ చేసింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి పలు ప్రశ్నలు సంధించింది. కాగా, రాజస్థాన్‌లో రాహుల్‌ యాత్ర సందర్బంగా మంగళవారం జరిగిన ఓ సభలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ క్రమంలో సభావేదిక మీదకు కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ సందర్బంగా నేతలు ఒకానొక సమయంలో ఒకరినొకరు తోసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, సభ ముగిసిన అనంతరం.. కొందరు కార్యకర్తలు రాహుల్‌ గాంధీతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ తరుణంలో కొందరు కార్యకర్తలు రాహుల్‌ మీదకు దూసుకొచ్చారు. దీంతో, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం, ఓ కార్యకర్త తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకుంటుండగా సహనం కోల్పోయిన రాహుల్‌ గాంధీ.. ఫోన్‌ను కోపంతో పక్కకు జరిపారు. ఈ క్రమంలో సీరియస్‌ కూడా అయ్యారు. 

కాగా, దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ నేత ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేశారు. ఈ వీడియోకు రాహుల్‌ గాంధీ ఎందుకంత చిరాకుగా ఉన్నారు? అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల కాలంలో చైనాలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ యాత్రపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్‌ పెంచింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్‌ ప్రోటోకాల్‌ అనుసరించడం సాధ్యం కాకపోతే.. దేశ ప్రయోజనాల దృష్ట్యా యాత్రను వాయిదా వేయాలని రాహుల్‌, అశోక్‌ గెహ్లాట్‌ను కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయా లేఖ రాశారు. యాత్రలో టీకాలు తీసుకున్న వారు మాత్రమే పాల్గొనాలి అని స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు