నాలుగేళ్ల కిందటి ట్వీట్‌.. ‘ఆల్ట్ట్‌ న్యూస్‌’ జుబేర్‌ అరెస్టు.. రాహుల్‌, ఒవైసీ సహా పలువురి ఖండన

28 Jun, 2022 08:09 IST|Sakshi

న్యూఢిల్లీ: మతపరమైన మనోభావాలను రెచ్చగొట్టిన ఆరోపణలపై ఫ్యాక్ట్‌చెక్‌ వెబ్‌సైట్‌ ‘ఆల్ట్‌ న్యూస్‌’ సహ వ్యవస్థాపకుడు, జర్నలిస్టు మొహమ్మద్‌ జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు సోమవారం అరెస్టు చేసి.. కస్టడీకి తరలించారు. నాలుగేళ్ల కిందట ఆయన షేర్‌ చేసిన ఓ ట్వీట్‌ పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆ ట్వీట్‌ మతపరమైన సెంటిమెంట్లను దెబ్బతీసేదిగా ఉందని, విద్వేషాలను రగిల్చేదిగా ఉందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. 

అరెస్టును కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ సీనియర్లు శశిథరూర్‌, జైరాం రమేష్‌లతో పాటు మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. లాయర్‌, ఉద్యమవేత్త ప్రశాంత్‌ భూషణ్‌ సైతం.. ఈ వ్యవహారాన్ని తప్పుబట్టారు. ఓ కేసులో ప్రశ్నించేందుకు పిలిచి.. ఆయన్ని మరొక కేసులో అరెస్ట్‌ చేశారని జుబేర్‌ సహ ఉద్యోగి, ఆల్ట్‌ న్యూస్‌ మరో సహవ్యవస్థాపకుడు ప్రతీక్‌ సిన్హా ఆరోపిస్తున్నారు. 

2020లో నమోదు అయిన ఓ కేసుకు సంబంధించి జుబేర్‌ను ఢిల్లీ పోలీసులు ప్రశ్నించేందుకు పిలిచారు. ఆ కేసులో ఆయన్ని అరెస్ట్‌ చేయొద్దని కోర్టు సైతం రక్షణ ఇచ్చింది. అయితే.. తీరా అక్కడికి వెళ్లాక పోలీసులు కొత్త కేసును తెర మీదకు తెచ్చారు. పైగా అది నాలుగేళ్ల కిందటిది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే జుబైర్‌ను అరెస్ట్‌ చేశామని చెప్తున్నారు. ఏ ఎఫ్‌ఐఆర్‌ మీద అరెస్ట్‌ చేశారో చెప్పమంటే.. కనీసం కాపీ కూడా చూపించట్లేదు అని సిన్హా ఢిల్లీ పోలీసులపై ఆరోపణలు గుప్పించారు.

మరిన్ని వార్తలు