భారత వ్యతిరేకి రాహుల్‌ గాంధీ

18 Mar, 2023 04:12 IST|Sakshi

‘టూల్‌కిట్‌’లో శాశ్వత భాగస్వామి 

దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా డిమాండ్‌  

న్యూఢిల్లీ:  భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ లండన్‌ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత వ్యతిరేక టూల్‌కిట్‌లో రాహుల్‌ శాశ్వత భాగస్వామిగా మారాడని ధ్వజమెత్తారు. భారత్‌కు బద్ధవ్యతిరేకి అయిన జార్జి సోరోస్‌ భాషలోనే రాహుల్‌ మాట్లాడాడని మండిపడ్డాడు. మన దేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తులు పెద్ద కుట్ర పన్నుతున్నాయని, ఇందులో కాంగ్రెస్‌తోపాటు సోకాల్డ్‌ వామపక్ష ఉదారవాదులు కూడా భాగమేనని ఆరోపించారు.

దేశాన్ని ద్వేషించే కాంగ్రెస్‌ నాయకులు పాకిస్తాన్‌ భాషను వాడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు నడ్డా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని విదేశీ శక్తులను కోరిన రాహుల్‌ గాంధీ దేశ సార్వభౌమత్వంపై దాడి చేశారని, ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. భారత్‌లో జోక్యం చేసుకోవాలంటూ అమెరికా, యూరప్‌ దేశాలను కోరడం కంటే సిగ్గుచేటు మరొకటి ఉండదన్నారు.

భారత ప్రజాస్వామ్యాన్ని రాహుల్‌ ఇంకా అర్థం చేసుకోలేదని, ప్రజలపై ఆయనకు విశ్వాసం లేదని విమర్శించారు. భారత్‌ను ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దెబ్బకొట్టడాన్ని విదేశీ కుట్రదారులు పనిగా పెట్టుకున్నారని, రాహుల్‌ గాంధీ సైతం వారితో చేతులు కలిపాడని దుయ్యబట్టారు. విదేశీ గడ్డపై ఆయన చేసిన పనిని స్వతంత్ర భారతదేశంలో గతంలో ఏ నాయకుడూ చేయలేదని నడ్డా వెల్లడించారు. రాహుల్‌ ధోరణి దేశంలో ప్రతి ఒక్కరి మనసులను గాయపర్చిందని చెప్పారు.

భారత్‌కు వ్యతిరేకంగా పనిచేస్తున్న శక్తులు దేశంలో బలహీన ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నాయని ఆరోపించారు. పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభమైనప్పుడల్లా దేశ వ్యతిరేక ముఠాలు చురుగ్గా మారుతున్నాయని, భారత్‌ను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా టూల్‌కిట్‌తో ముందుకొస్తున్నాయని జేపీ నడ్డా ఆక్షేపించారు. భారత్‌లో దృఢమైన ప్రజాస్వామ్యం, నిర్ణయాత్మక ప్రభుత్వం ఉన్నాయని, దుష్టశక్తుల ఆటలు సాగవని హెచ్చరించారు.    
 
రాహుల్‌ వ్యాఖ్యలు జాతివ్యతిరేకం కాదు : శశిథరూర్‌
తమ నేత రాహుల్‌ గాంధీ బ్రిటన్‌లో చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి జాతి వ్యతిరేకత లేదని ఆ పార్టీ సీనియర్‌ నేత శశిథరూర్‌ అన్నారు. భారత ప్రజాస్వామ్యంలోకి విదేశీ శక్తుల్ని రాహుల్‌ ఎందుకు రానిస్తారని ప్రశ్నించారు. శుక్రవారం ఇండియా టుడే సదస్సులో శశిథరూర్‌ రాహుల్‌ వ్యాఖ్యలు పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేసేటంత ప్రధానమైనవా ఆలోచిస్తూ ఉంటే చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. దేశంలో ఎన్నో ప్రజా సమస్యల్ని గాలికొదిలేసిన బీజేపీ రాహుల్‌ నుంచి క్షమాపణ కోరుతూ రాజకీయం చేయడం విడ్డూరమన్నారు.

మరిన్ని వార్తలు