ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ రహస్య సమాజం: రాహుల్‌ గాంధీ

7 Mar, 2023 13:33 IST|Sakshi

కాంగ్రెస్‌ మాజీ నాయకుడు, వాయ్‌నాడ్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ అధికార బీజేపీపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు రాహుల్‌ పర్యటన ముగింపు సందర్భంగా లండన్‌లోని చతం హౌస్‌ థింక్‌ ట్యాంక్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ భారతదేశంలో శాశ్వతంగా అధికారంలో ఉంటుందని భావిస్తోంది. కానీ అందులో నిజం లేదని, అలాని కాంగ్రెస్‌ పోతుందని అర్థం కాదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కాలాన్ని పరిశీలిస్తే ఎక్కువ కాలం కాంగ్రెస్‌ పార్టీయే అధికారంలో ఉంది. బీజేపీ అధికారంలోకి రాకమునుపే మేము పదేళ్లు అధికారంలో ఉన్నాం." అని అన్నారు. అలాగే మరోసారి ఇజ్రాయెల్‌ సాఫ్ట్‌వేర్‌ పెగాసెస్‌ గురించి మరోసారి ప్రస్తావించారు.

అంతేగాదు భారత ప్రజస్వామ్యానికి మరమత్తులు చేపట్టడానికి ప్రతిపక్షాలన్ని కలిసి రావాలని పిలుపునిచ్చారు. భారత్‌లో జరుగుతున్న మార్పులను ఎత్తిచూపారు. తాము అధికారంలో ఉంటే గ్రామీణ ప్రాంతాలపైనే దృష్టిసారిస్తాం అన్నారు. బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్‌ పోయిదనేది అవాస్తవం అని నొక్కి చెప్పారు. అలాగే కాంగ్రెస్‌ తోపాటు విదేశీ మీడియా సైతం భారత ప్రజాస్వామ్యంలో తీవ్ర సమస్య ఉందని హైలెట్‌ చేసి మరీ చెబుతోందన్నారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ని ఫండమెంటలిస్ట్‌ ఫాసిస్ట్‌ సంస్థగా లక్ష్యం చేసుకుని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదీ దేశంలోని సంస్థలను స్వాధీనం చేసుకుంటోందని,  దీన్ని ఒక రహస్య సమాజం అని పిలవచ్చని అన్నారు. ముస్లీం బ్రదర్‌ హుడ్‌ తరహాలో నిర్మితమైందన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని వినియోగించుకుని అధికారంలోకి వచ్చి ఆ తర్వాత ప్రజాస్వామ్యాన్నే అణిచేస్తుందని ఆరోపణలు చేశారు.

ప్రస్తుతం పత్రికా, న్యాయవ్యవస్థ, పార్లమెంటు, ఎన్నికల సంఘం తదితరాలు ఒత్తిడికి గురవుతున్నాయని, ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు రాహుల్‌​. అలాగే భారత విదేశాంగ విధానంపై, భారత్‌ చైనా సంబంధాలపై కూడా పలు వ్యాఖ్యలు చేశారు. కాగా, విదేశీ గడ్డపై రాహుల్‌ భారత్‌ని దూషించారంటూ బీజేపీ ఆరోపించింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి అనురాగ్‌ ఠాగూర్‌ లండన్‌లో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భారత్‌కు ద్రోహం చేయకండి, భారత విదేశాంగ విధానంపై మీరు చేసిన వ్యాఖ్యలు మీ అవగాహనలేమికి నిదర్శనం అంటూ కొట్టిపారేశారు. విదేశీ గడ్డపై మీరు చేస్తున్న వ్యాఖ్యలను ఎవరూ నమ్మరన్నారు. ఆయన ఎంతసేపు తనను తాను హైలెట్‌ చేసుకునేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఎద్దేవా చేశారు అనురాగ్‌ ఠాగూర్‌. 

(చదవండి: కూతుళ్ల కోసం మళ్లీ పెళ్లి చేసుకుంటున్న జంట..ఓ తండ్రి గొప్ప నిర్ణయం..)

మరిన్ని వార్తలు