Bungalow Eviction Notice: రాహుల్‌ లేఖలో..నేను గడిపిన సంతోషకరమైన జ్ఞాపకాలు

28 Mar, 2023 13:11 IST|Sakshi

రాహుల్‌ గాంధీకి అనర్హత వేటు పడిన తర్వాత ఆయన నివాసముంటున్న అధికారిక బంగ్లా ఖాళీ చేయాలని సోమవారం లోక్‌సభ హౌసింగ్‌ ప్యానెల్‌ నోటీసులు  జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ భవనం న్యూఢిల్లీలోని తుగ్లక్ లేన్ 12లో ఉంది. రాహుల్‌ వాస్తవానికి జెడ్‌ ప్లస్‌ ప్రొటెక్షన్‌తో 2005 నుంచి అదే బంగ్లాలో ఉంటున్నారు. నోటీసులు అందుకున్న తర్వాత రాహుల్ లోక్‌సభ సెక్రటేరియేట్‌ కు ఒక లేఖ రాశారు. ఆ లేఖలో.. ఆ బంగ్లాతో ముడిపడి ఉన్న కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. గత నాలుగు పర్యాయాలుగా లోక్‌సభకు ఎన్నికైన సభ్యుడిగా ప్రజలిచ్చిన తీర్పుతో ఇక్కడ ఉంటున్న నాకు ఈ భవనంతో చిరస్మరణీయ జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని, అలాగే నా హక్కులకు భంగం వాటిల్లకుండా లేఖలో పేర్కొన్న వాటికి కట్టుబడి ఉంటాను అని రాహుల్ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే డిస్ క్వాలిఫై అయ్యాను కాబట్టి, నిబంధనల మేరకు నడుచుకుంటానని, లోక్ సభ సభ్యత్వం ద్వారా సంక్రమించిన బంగాళాను ఖాళీ చేస్తానని తెలిపారు. 

అయితే బంగళా ఖాళీ చేయాలన్న లోక్ సభ సెక్రటేరియట్ ఆదేశంపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి. దీనిపై కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున్‌ ఖ‍ర్గే మాట్లాడుతూ.. రాహుల్‌ గాంధీని కించపరిచే ప్రయత్నాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్‌ ను దెబ్బతీసేందుకే ఇలా చేస్తున్నారని, తుగ్లక్ లేన్ లో ఉన్న బంగ్లా ఖాళీ చేస్తే రాహుల్ తన తల్లితో కలిసి ఉండొచ్చని, లేదా తనకు కేటాయించిన బంగళా అయినా వాడుకోవచ్చని ఖర్గే తెలిపారు. అయినా రాహుల్‌ని భయపెట్టి, బెదిరించడం, అవమానించడం సరికాదని, ఈ విషయంలో ​ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని ఖర్గే అన్నారు. 

(చదవండి: ప్రధాని ఇమేజ్‌ని డ్యామేజ్‌ చేయటం అంత ఈజీ కాదు!: స్మృతి ఇరానీ)

మరిన్ని వార్తలు