కేంద్రంపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు.. పెగాసెస్‌పై కామెంట్స్‌ ఇవే..

3 Mar, 2023 10:37 IST|Sakshi

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా, రాహుల్‌.. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఉపన్యాసం సందర్భంగా కీలక కామెంట్స్‌ చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రాథమిక నిర్మాణంపై దాడి జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాహుల్‌ గాంధీ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటిలో మాట్లాడుతూ.. దేశంలో పెద్ద సంఖ్యలో రాజకీయా నేతల ఫోన్‌లలో పెగాసెన్‌ స్పైవేర్‌ ఉందన్నారు. ఇజ్రాయెల్ స్పైవేర్ పెగాసస్ తన ఫోన్‌లోకి స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనకు కాల్ చేశారని ఫోన్‌లో మాట్లాడే విషయాలను తాము రికార్డు చేస్తున్నట్లు తనకు చెప్పినట్టు తెలిపారు. ఈ విషయమై తనను హెచ్చరించినట్టు పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం.. సెంట్రల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్నారు. కేవలం ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై కూడా అనేక అభియోగాలపై కేసులు నమోదు చేశారన్నారు. ప్రజస్వామ్య నిర్మితమైన దేశంలో మీడియా, ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు సరికాదన్నారు. 

ఇదే సమయంలో గత ఏడాది ఆగస్టులో, స్నూపింగ్ కోసం పెగాసస్‌ను ప్రభుత్వం ఉపయోగించుకుందనే ఆరోపణలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు.. ఓ కమిటీని నియమించింది. ఇక, కమిటీ తాము పరిశీలించిన 29 మొబైల్ ఫోన్‌లలో స్పైవేర్ కనిపించలేదని పేర్కొంది. కానీ.. ఐదు మొబైల్‌ ఫోన్లలో మాల్వేర్ కనుగొన్నట్టు నివేదికలో తెలిపారు. ఈ కమిటీ నివేదికపై సుప్రీంకోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. ఐదు ఫోన్లలో కొన్ని మాల్వేర్‌లు కనిపించాయని, అయితే అది పెగాసస్ అని చెప్పలేమని టెక్నికల్ కమిటీ చెబుతోంది. అయితే, టెక్నికల్ కమిటీ నివేదికపై ఆందోళన చెందుతున్నామని కామెంట్స్‌ చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు