ప్రధాని కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవు

23 Jun, 2021 07:33 IST|Sakshi

కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజం

న్యూఢిల్లీ: కరోనా థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉందని, దానిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సర్వసన్నద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అన్నారు. ప్రతీ ఒక్కరికీ వ్యాక్సిన్, వైద్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా కరోనాని కట్టడి చేయగలమని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున మంగళవారం కరోనాపై శ్వేత పత్రాన్ని రాహుల్‌ గాంధీ విడుదల చేశారు. ఈ శ్వేతపత్రం కేంద్రాన్ని నిందించడానికి కాదని, కరోనాని ఎదుర్కోవడానికి కేంద్రానికి వీలైనంత సాయపడడానికేనని ఆయన చెప్పారు.

కరోనా ఫస్ట్, సెకండ్‌ వేవ్‌ ఎదుర్కోవడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని రాహుల్‌ ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా మరణాలపై కన్నీళ్లు పెట్టుకోవడాన్ని రాహుల్‌ ప్రస్తావిస్తూ కేంద్రం తగిన జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఆ మరణాలు సంభవించి ఉండేవి కావని అన్నారు. ‘‘ప్రధాని కన్నీళ్లు ప్రజల ప్రాణాలను కాపాడలేకపోయాయి. మృతుల కుటుంబాల కన్నీళ్లను తుడవలేకపోయాయి.  కానీ ఆక్సిజన్‌ సరఫరా ప్రజల ప్రాణాలను కాపాడి ఉండేది’’ అని రాహుల్‌ అన్నారు. సెకండ్‌ వేవ్‌ని సీరియస్‌గా తీసుకోకుండా ప్రధానమంత్రి బెంగాల్‌ ఎన్నికలపై దృష్టి పెట్టడం శోచనీయమని అన్నారు.

మృతుల కుటుంబాలకు పరిహారమివ్వాలి 
దేశంలో ప్రతీ ఒక్కరికీ టీకా వీలైనంత వేగంగా ఇవ్వాలని రాహుల్‌ చెప్పారు. వ్యాక్సిన్‌  పంపిణీలో అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలన్నారు. కరోనాని ఎదుర్కోవడంలో గతంలోని వైఫల్యాలను ఇప్పుడు సరిదిద్దుకోవాలని సూచించారు. ఆక్సిజన్‌ వంటి సదుపాయాలు పెంచాలని, నిరుపేదలకు ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని, కోవిడ్‌ నష్టపరిహారం నిధులను ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కరోనా సంక్షోభ సమయంలో రాహుల్‌ రాజకీయాలు చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ శ్వేతపత్రాన్ని బీజేపీ తిప్పి కొట్టింది. కరోనాపై పోరాటంలో ఏ కాస్త మంచి జరిగిందని భావించినా మధ్యలో రాహుల్‌ వచ్చి ఏదో ఒకటి చేస్తారని బీజేపీ నేత సంబిత్‌ పాత్రా అన్నారు.

చదవండి: మాజీ ప్రధాని దేవెగౌడకు భారీ జరిమానా

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు