అసోం బహిరంగ సభలో రాహుల్‌ వ్యాఖ్యలు

14 Feb, 2021 17:54 IST|Sakshi

గౌహతి: కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే అసోంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) ఎప్పటికీ అమలు కానీయమని(రద్దు చేస్తామని) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. అసోంలోని శివసాగర్‌లో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అసోం విభజనకు బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అసోం ఒప్పందంలోని ప్రతి అంశాన్ని పరిరక్షించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రానికి 'సొంత ముఖ్యమంత్రి' అవసరమని, అతను ప్రజల వాణి వినగలిగే వాడై ఉండాలే కానీ, నాగపూర్, ఢిల్లీ చెప్పినట్టు నడుచుకునే వాడు కాకూడదని విమర్శించారు. 

ప్రస్తుత ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్‌ నాగపూర్, ఢిల్లీ మాటల ప్రకారమే నడుచుకుంటారని ఆరోపించారు. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షాలు రాష్ట్రంలోని సహజవనరులు, పీఎస్‌యూలను వ్యాపారవేత్తలకు కట్టబెట్టే పనిలో నిమగ్నమైవున్నారని, వారికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టవని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు మరో అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో(మార్చి, ఏప్రిల్‌) జరుగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు కాక పుట్టిస్తున్నాయి.
 

మరిన్ని వార్తలు