తమిళులపై మోదీ సవతి ప్రేమ 

24 Jan, 2021 08:32 IST|Sakshi

భాష, సంస్కృతులపై చిన్నచూపు 

కోయంబత్తూరు రోడ్‌షోలో రాహుల్‌ విమర్శలు 

సాక్షి, చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడుపై సవతితల్లి ప్రేమచూపుతోంది, ప్రధాని మోదీ తమిళులను ద్వితీయశ్రేణి పౌరులుగా పరిగణిస్తూ తమిళభాష, సంస్కృతులను అవమానిస్తున్నారని అఖిలభారత కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు రాహుల్‌గాంధీ విమర్శించారు. కోవైలో శనివారం ఆయన రోడ్‌షో ద్వారా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఒకే దేశం, ఒకే భాష అనే విధానాన్ని ప్రధాని మోదీ అవలంభిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ పక్షపాత ధోరణిని నిరసిస్తూ పోరాడుతోందని చెప్పారు. అన్ని రాష్ట్రాల ప్రజలు, భాషలను మేము సమానంగా పరిగణిస్తున్నామని మాకు, మోదీకి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం అదే అన్నారు.

దేశంలో తన స్నేహితులైన కొందరు బడా పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం మోదీ పాటుపడుతున్నారన్నారు. భారతదేశ, తమిళ ప్రజల హక్కులను అమ్మేందుకు ఆయన సిద్ధమవుతున్నారని చెప్పారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా అన్నదాతల హక్కులను హరించారన్నారు. అందుకే బీజేపీని వ్యతిరేకిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామన్నారు. తమిళనాడు యు వకులు దురదృష్టవశాత్తు ఉద్యోగావకాశాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రజలు కోరుకునే పాలనను అందించే ప్రభుత్వాన్ని తమిళనాడులో నెలకొల్పుతామన్నారు. రాహుల్‌ రోడ్‌ షోలో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు కేఎస్‌ అళగిరి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు