మొన్న రైల్వే కూలీ.. నేడు రైల్వే ప్యాసింజర్‌.. సర్‌ప్రైజ్‌ చేసిన రాహుల్‌ గాంధీ

25 Sep, 2023 21:21 IST|Sakshi

రాయ్‌పూర్‌: దేశంలో ఈ ఏడాది చివరలో జరగబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ స్పీడ్‌ పెంచింది. మరోవైపు, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. దేశవ్యాప్తంగా ప్రజల్లోకి దూసుకెళ్తూ వినూత్నంగా ముందుకు సాగుతున్నారు. తాజాగా ప్యాసింజర్‌ రైలులో ప్రయాణి​ంచి అందరినీ ఆశ్చర్యపరిచారు రాహుల్‌ గాంధీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

అయితే, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తాజాగా పార్టీ నేతలతో కలిసి రైలులో​ ప్రయాణించారు. సాధారణ వ్యక్తిలా ట్రైన్‌లో ప్రయాణిస్తూ అందరినీ పలకరించారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలతో కలిసి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ నుంచి రాయ్‌పూర్‌ వరకు ఇంటర్‌ సిటీ రైల్లో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా పలువురు రాహుల్‌తో ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్‌ తీసుకునేందుకు ఎగబడ్డారు. మరోవైపు, ఇటీవలే రాహుల్‌ గాంధీ రైల్వే కూలీ అవతారమెత్తిన విషయం తెలిసిందే.

ఢిల్లీలోని ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్‌లో ఎర్రని చొక్కా ధరించి నెత్తిన లగేజ్ పెట్టుకుని మోశారు. రైల్వే కూలీలు ధరించి బ్యాడ్జీ ధరించి అచ్చం కూలీలాగే కనిపించి  అభిమానులను అలరించారు.  రైల్వే కూలీల కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్ చిరునవ్వులు చిందుతూ రైల్వే కూలీలా మూటలు మోస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఇక, అంతకుముందు ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన గృహ నిర్మాణాలకు సంబంధించిన కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల గణన నిర్వహించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. గడిచిన కొన్ని నెలల్లో రాష్ట్రంలో 2,600 రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసిందని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: భారత్‌ను ముక్కలు చేసేందుకు ప్లాన్‌.. కశ్మీర్‌ను ప్రత్యేక దేశంగా..

మరిన్ని వార్తలు