భూమిపూజ : రాహుల్‌ కీలక వ్యాఖ్యలు

5 Aug, 2020 16:26 IST|Sakshi

రాముడిని కొనియాడిన రాహుల్‌

సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి బుధవారం భూమి పూజ కార్యక్రమం నేపథ్యంలో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ రాముడిని కొనియాడుతూ ట్వీట్‌ చేశారు. రాముడు ప్రేమకు, న్యాయానికి ప్రతిరూపమని ప్రస్తుతించారు. రాహుల్‌ తన ట్వీట్‌లో ఎక్కడా బీజేపీని ప్రస్తావించలేదు. ‘మర్యాద పురుషోత్తముడైన రాముడు ఉత్తమ మానవ లక్షణాలను పుణికిపుచ్చుకున్నారు.  అతను మన మనస్సు లోతుల్లో ఉన్న మానవత్వానికి ప్రతీక.. ప్రేమను చాటే రాముడు ఎన్నడూ ద్వేషాన్ని వ్యక్తపరచరు. కరుణామయుడైన రాముడిలో ఎప్పుడూ క్రూరత్వం కనిపించదు. న్యాయానికి ప్రతిరూపమైన రాముడు ఎన్నడూ అన్యాయం వ్యక్తీకరించర’ని రాహుల్‌ ట్వీట్‌ చేశారు.

కాగా అయోధ్యలో జరిగే భూమిపూజ కార్యక్రమం జాతి ఐక్యతకు సంకేతంగా నిలిచే సాంస్కృతిక సమ్మేళనం కావాలని ఆకాంక్షిస్తూ రాహుల్‌ సోదరి ప్రియాంక గాంధీ సోమవారం ట్వీట్‌ చేశారు. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అత్యంత వైభవంగా జరిగిన భూమిపూజ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీకి ఆహ్వానం లభించలేదు. రామాలయ నిర్మాణం ప్రారంభ సూచకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 40 కిలోల వెండి ఇటుకను అమర్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సహా దాదాపు 150 మంది పాల్గొన్నారు. చదవండి : డిగ్గీ రాజా సలహా : కాంగ్రెస్‌లో గగ్గోలు

మరిన్ని వార్తలు