రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు...!

3 Apr, 2021 15:34 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ హార్వ‌ర్డ్ కెనడీ స్కూల్ ప్రొఫెస‌ర్‌ నికోల‌స్ బ‌ర్న్స్‌తో  జరిగిన వర్చువల్‌ సమావేశంలో ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. ఈ సమావేశంలో పలు అంశాలపై రాహుల్‌ గాంధీ చర్చించారు. ప్రొఫెసర్‌ నికోలస్‌ ‘మీరు ఒక వేళ భారత్‌కు ప్రధానమంత్రి ఐతే ఏం చేస్తార’ని రాహుల్‌ గాంధీని అడిగారు. రాహుల్‌ సమాధానమిస్తూ..  తాను భార‌త ప్ర‌ధాని అయితే  దేశంలో ఉద్యోగ క‌ల్ప‌న‌పైనే ఎక్కువగా దృష్టి సారిస్తా. అభివృద్ధి అనేది దేశానికి అవ‌స‌ర‌మైన‌ప్ప‌టికీ, ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. దేశంలో నిరుద్యోగం ఎక్కువగా పెరిగిపోయింది. అసలు వృద్ధికి, ఉద్యోగ క‌ల్ప‌న‌కు  సంబంధం లేకుండా అభివృద్ధి ఉంది. చైనాలో ఉద్యోగ క‌ల్ప‌న లాంటి స‌మ‌స్య‌లు లేవు.

ఆ దేశంలో ఉద్యోగాలు ఇవ్వ‌లేమ‌ని చెప్పే  చైనా నేతను ఎప్పుడు కలవలేదు. వృద్ధి రేటు 9 శాతం ఉండ‌డం కంటే దానికి త‌గ్గట్లుగా ఉద్యోగాల క‌ల్ప‌న జ‌ర‌గ‌డం ముఖ్యం. అసలు ఉద్యోగాల కల్పన లేని  వృద్ధి రేటు ఎందుకు పనికిరాదు. ప్రభుత్వ రంగ సంస్థ‌ల‌ను కేంద్ర ప్ర‌భుత్వం నాశ‌నం చేస్తోంది. ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే దేశంలో  మౌలిక వ్య‌వ‌స్థ‌లు ఉండాలి. ఆ వ్యవస్థలకు న్యాయ వ్యవస్థ నుంచి రక్షణ ఉండాలి. అంతేకాకుండా ప్రజాస్వామ్య దేశంలో  మీడియా స్వేచ్ఛ కల్పించాలి. దేశంలో జాతీయ మీడియా తమ స్థాయిని మరిచిపోయింది. అందుకే ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే ప‌టిష్ఠ‌మైన‌ సంస్థాగ‌త నిర్మాణాలు అవ‌స‌రం. బీజేపీ ప్ర‌ద‌ర్శిస్తోన్న  వైఖరీ దేశ ప్రజలను అసంతృప్తికి గురి చేస్తోంది’’ అని అన్నారు.

చదవండి: నా పేరు మోదీ కాదు.. నేను అబద్దాలు చెప్పడానికి రాలేదు

మరిన్ని వార్తలు