రాహుల్‌ యాత్రకు యూపీ నేతలు ముఖం చాటిన..కాశ్మీర్‌ నేతలంతా కదిలి వస్తారు!

27 Dec, 2022 21:35 IST|Sakshi

న్యూ ఇయర్‌ వేడుకల నిమిత్తం రాహుల్‌ భారత్‌ జోడో యాత్రకు తొమ్మిది రోజులు బ్రేక్‌ పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు జనవరి 3న ఢ్లిల్లీ-ఉత్తరప్రదేశ్‌ సరిహద్దు మీదుగా యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ జోడో యాత్రకు యూపీ నేతలు దూరంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కానీ జమ్ము కాశ్మీర్‌ నాయకులంతా హాజరయ్యే అవకాశం పూర్తిగా ఉందని చెబుతున్నారు.

ఈ మేరకు ఈ యాత్రలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రులు పాల్గొంటామని ట్వీట్టర్‌ ద్వారా తమ పూర్తి మద్దతును తెలిపారు. అంతేగాదు సీపీఐకి చెందిన ఎంవై తరిగామి గూప్‌కార్‌ కూటమికి చెందిన మరో సభ్యుడు కూడా హాజరవుతారని అంటున్నారు. కాగా, పీపుల్‌ డెమోక్రటిక్‌ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ ట్విట్టర్‌ వేదికగా.."భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ గాంధీతో చేరాల్సిందిగా నన్ను అధికారికంగా ఆహ్వానించారు. అతని అలు పెరగని ధైర్యానికి వందనం. ఫాసిస్ట్‌ శక్తులను ఎదిరించే ధైర్యం ఉన్న వ్యక్తితో నిలబడటం తన కర్తవ్యమని నమ్ముతున్నాను.

మెరుగైన భారతదేశం కోసం అతనితో కలిసి పాల్గొంటాను." అని ట్వీట్‌ చేశారు. ఈ మేరకు భారత్‌ జోడో యాత్ర ఏర్పాట్ల కోసం జమ్ము చేరుకున్న కాంగ్రెస్‌ నేత ఎంపీ కేసీ వేణుగోపాల్‌ మాట్టాడుతూ..యాత్ర ఇక్కడకు చేరుకోగానే కాశ్మీర్‌లో జెండా ఎగురవేస్తారని చెప్పారు. యాత్రలో ఫరూక్‌ అబ్దుల్లా, ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, తరిగామి తదితరులు పాల్గొంటారని చెప్పారు.

ఇదిలా ఉండగా, యూపీ నుంచి జయంత్‌ చౌదరి ఇప్పటికే రానని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి దూరమైన అఖిలేష్‌ యాదవ్‌ కూడా హజరయ్యే అవకాశం లేకపోలేదు. కానీ ఆయన వస్తారా లేక ప్రతినిధిని పంపుతారా అనేదానిపై స్పష్టత లేదు. గత కొన్నేళ్లుగా కాంగ్రెస్‌తో విభేదిస్తున్న మాయావతి కూడా అధికారికంగా స్పందించ లేదు.

ఐతే కాంగ్రెస్‌ పార్టీ 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని విపక్షాన్ని టార్గెట్‌ చేస్తూ చేస్తున్న యాత్ర కాదని స్పష్టం చేసినప్పటికీ పలు విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి. మరోవైపు ఈ యాత్రను అడ్డుకునేందుకు ఆప్‌ కోవిడ్‌ ప్రోటోకాల్‌లను అమలు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలోనే యాత్ర ఆపేయాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ కూడా రాసింది. దీంతో కాంగ్రెస్‌ నేత ఈ యాత్రను ఆపేందుకు ఇదోక సాకుగా చెబుతున్నారంటూ మండిపడ్డారు కూడా. 

(చదవండి: భగ్గుమంటున్న సరిహద్దు వివాదం: తగ్గేదేలే! అన్న బసవరాజ్‌ బొమ్మై)

మరిన్ని వార్తలు