ఏనుగును ఈడ్చుకెళ్లిన రైలు ఇంజన్‌ సీజ్‌

22 Oct, 2020 08:25 IST|Sakshi

గువహతి : పట్టాలు దాటుతున్న తల్లి ఏనుగును, పిల్ల ఏనుగును ఢీకొట్టడమే కాకుండా పిల్ల ఏనుగును దాదాపు కిలోమీటర్‌ వరకు ఈడ్చుకెళ్లిందో గూడ్సు రైలు. ఆ రెండు ఏనుగులు మృత్యువాత పడిన ఈ ఘటనలో గూడ్సు రైలు ఇంజన్‌ను‌ సీజ్‌ చేశారు అస్సాం అటవీ శాఖ అధికారులు. వివరాల్లోకి వెళితే.. గత సెప్టెంబర్‌ 27న అస్సాం లుండింగ్‌ రిజర్వ్‌ ఫారెస్ట్‌‌ ప్రాంతంలో రైలు పట్టాలు దాటుతున్న 35 ఏళ్ల ఓ ఏనుగును దాని పిల్లను నార్త్‌ ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వేకు చెందిన ఓ గూడ్సు రైలు ఢీకొంది. దీంతో తల్లి ఏనుగు పైకి ఎగిరి పక్కకు పడిపోయింది. పిల్ల ఏనుగు పట్టాలపై పడిపోగా.. రైలు దాన్ని ఒక కిలోమీటరు వరకు ఈడ్చుకెళ్లింది. ఆ రెండు ఏనుగుల మృత్యువాతపై అస్సాం అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ( పీల్చే గాలి విషం )

రిజర్వ్‌ ఫారెస్ట్‌ ప్రాంతంలో అతి వేగంగా వెళ్ల కూడదన్న నిబంధనలను సదరు రైలు అతిక్రమించిందని అటవీ అధికారులు గుర్తించారు. విచారణలో భాగంగా గత మంగళవారం నాడు గువహతి బామునిమైదాన్‌ రైల్వే యార్డ్‌లో సదరు రైలు ఇంజన్‌ను సీజ్‌ చేశారు. దాని ఇద్దరు లోకో పైలట్లను సస్పెండ్‌ చేశారు. దానిపై కేసు నమోదు చేసిన తర్వాత రైల్వే శాఖకు అప్పగించారు. దీనిపై స్పందించిన నార్త్ ‌ఈస్ట్‌ ఫ్రంటియర్‌ రైల్వే ‘‘ రైలు ఇంజన్‌ను సీజ్‌ చేయటం ఇది మొదటి సారేమీ కాదు. విచారణలో భాగంగా ఇంజన్‌ను సీజ్‌  చేశారు. ప్రస్తుతం ఆ రైలు ఇంజన్‌ వాడకంలోనే ఉంద’’ని తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు