బొగ్గు సరఫరా రైళ్లకు బ్రేక్‌.. కలకలం

18 Oct, 2021 19:06 IST|Sakshi

న్యూఢిల్లీ: లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాకాండకు నిరసనగా రైతు సంఘాలు సోమవారం చేపట్టిన రైల్‌ రోకో కారణంగా దేశవ్యాప్తంగా 293 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. 150 గూడ్స్‌ రైళ్లకు ఆటంకం ఏర్పడగా వీటిలో 75 వరకు విద్యుత్‌ కేంద్రాలకు బొగ్గు సరఫరా చేస్తున్న రైళ్లు ఉన్నట్టు సమాచారం. బొగ్గు కొరత కారణంగా పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ సంక్షోభం తలెత్తనుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో గూడ్స్‌ రైళ్లు నిలిచిపోవడం ఆందోళన కలిగిస్తోంది. 

ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాకాండకు బాధ్యుడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర  మంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా నేడు రైల్‌ రోకోకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైలు పట్టాలపై పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు.  


పంజాబ్‌లోని ఫిరోజిపూర్‌ డివిజన్‌లోని నాలుగు రైల్వే విభాగాలు రైతుల ఆందోళనతో స్తంభించాయని అధికారులు తెలిపారు. ఫిరోజ్‌పూర్ నగరంలోని ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా విభాగం, మొగాలోని అజిత్వాల్ వద్ద ఉన్న ఫిరోజ్‌పూర్-లూధియానా విభాగంపై నిరసనల ప్రభావం పడిందని వెల్లడించారు. 


మిశ్రాను అరెస్ట్‌ చేసే వరకు విశ్రమించం: తికాయత్‌

'రైల్ రోకో' ఆందోళన కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందని, తదుపరి వ్యూహం కోసం ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తామని బీకేయూ నేత రాకేశ్‌ తికాయత్‌ తెలిపారు. లఖీమ్‌పూర్‌ ఖేరి హింసాకాండకు బాధ్యుడైన అజయ్‌ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించి, అరెస్ట్‌ చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. నిందితుడిగా ఉన్న అజయ్‌ మిశ్రాకు మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేదని, కేంద్రం ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఆయన నిర్దోషిగా తేలితే మళ్లీ మంత్రి కట్టబెట్టుకోవచ్చని తికాయత్‌ అన్నారు. (చదవండి: హత్య కేసులో డేరాబాబాకు జీవిత ఖైదు)

మరిన్ని వార్తలు