వీడియో: కుంభవృష్టి.. ఆకస్మిక వరదలు.. అమాంతం కూలిన రైల్వే బ్రిడ్జి.. వందల గ్రామాలకు తెగిన సంబంధాలు

20 Aug, 2022 13:58 IST|Sakshi

సిమ్లా: కుంభవృష్టి ప్రభావంతో ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వణికిపోతున్నాయి. ఆకస్మిక వరదల కారణంగా.. ఇరు రాష్ట్రాల్లోనూ భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. మరో ఐదు రోజుల పాటు ఇదే పరిస్థితి నెలకొనవచ్చనే వాతావరణ శాఖ హెచ్చరికలతో భయాందోళనలు కొనసాగుతున్నాయి. 

ఇదిలా ఉంటే.. కాంగ్రా జిల్లా చక్కీ బ్రిడ్జి ఆకస్మిక వరదలకు కుప్పకూలింది. పిల్లర్లు డ్యామేజ్‌ కావడంతో వదర ఉదృతిని తట్టుకోలేక బ్రిడ్జి అంతా చూస్తుండగానే కూలిపోయి.. చక్కీ నదిలో కొట్టుకుపోయింది. పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సరిహద్దు జిల్లా అయి కంగ్రాలో చక్కీ నదిపై ఉన్న 800 మీటర్ల రైల్వే వంతెన శనివారం కూలిపోయింది. దీంతో వంతెన కొత్త పిల్లర్‌ను నిర్మించేంత వరకు పఠాన్‌కోట్‌, జోగిందర్‌ నగర్‌ మధ్య రైళ్ల రాకపోకలను అధికారులు నిలిపివేశారు. 

ఈ బ్రిడ్జిని 1928లో బ్రిటిషర్లు కట్టించారు. రోడ్లు, బస్సు మార్గాలు అందుబాటులో లేకపోవడంతో.. పాంగ్‌ డ్యామ్‌ వన్యప్రాణుల అభయారణ్యంలో ఉన్న వందలాది గ్రామాలకు ఈ రైలు మార్గం ఆధారం. అయితే.. నదీ గర్భంలో అక్రమ మైనింగ్‌తో 90 ఏళ్ల నాటి వంతెన బలహీనపడింది. దీనిపై పలు ఫిర్యాదులు సైతం అధికారులకు అందాయి. గతంలో ఓ పిల్లర్‌కు పగుళ్లు రావడంతో రైలు సేవలను నిలిపివేయగా.. ఇప్పుడు ఏకంగా స్థంభమే కొట్టుకుపోయింది.

మరోవైపు ధర్మశాలలోనూ కొండ చరియలు విరిగిపడ్డాయి. హిమాచల్‌ ప్రదేశ్‌లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఆరుగురు మృతి చెందగా.. మండిలో మరో పదమూడు మంది కూడా మరణించి ఉంటారని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనలపై ముఖ్యమంత్రి జై రామ్‌ థాకూర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

ఇదీ చదవండి: పార్టీ చేసుకున్న ప్రధాని... స్టెప్పులతో హల్‌చల్‌: వైరల్‌

మరిన్ని వార్తలు