CSMT: సినిమా షూటింగ్‌లకు కేరాఫ్‌ అడ్రస్‌.. రికార్డు స్ధాయిలో ఆదాయం

6 May, 2022 16:34 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రముఖ చారిత్రాత్మక కట్టడమైన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టర్మినస్‌ (సీఎస్‌ఎంటీ) రైల్వే స్టేషన్, భవనం ఆవరణలో నిర్వహించిన సినిమా, ప్రకటనల షూటింగులు సెంట్రల్‌ రైల్వేకు భారీ ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నాయి. వాణిజ్య, వ్యాపార సంస్ధలు, సినీ నిర్మాతలు తమ సినిమాలు, ప్రకటనల షూటింగులకు సీఎస్‌ఎంటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సినిమా లేదా ప్రకటనలో ఎక్కడో ఒక చోట సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్, రైల్వే ప్లాట్‌ఫారం, వారసత్వ కట్టడమైన ఈ స్టేషన్‌ భవనం కనిపించాలని నిర్మాతలు తహతహలాడుతుంటారు.

దీంతో సీఎస్‌ఎంటీవద్ద షూటింగ్‌ చేయడానికి ఎక్కువ ప్రాధా న్యత ఇస్తారు. కాని లాక్‌డౌన్‌ కారణంగా 2020 మార్చి తరువాత సినిమా, ప్రకటనల షూటింగులు జరగలేదు. దీంతో సెంట్రల్‌ రైల్వే ఆదాయాన్ని కోల్పోయింది. కాని గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్‌ తరువాత కరోనా నియంత్రణలోకి రావడంతో సినిమా, ప్రకటనల షూటింగులకు అనుమతివ్వడం మొదలైంది. గడచిన ఐదారు నెలల్లో సీఎస్‌ఎంటీ వద్ద చేపట్టిన ఆరు సినిమాలు, రెండు వెబ్‌ సిరీజ్‌లు, ఒక డాక్యుమెంటరీ, ఒక ప్రకటన షూటింగుల వల్ల సెంట్రల్‌ రైల్వే రికార్డు స్ధాయిలో ఏకంగా రూ.2.48 కోట్ల ఆదాయం వచ్చింది.
చదవండి: ఆసుప‌త్రిలో కన్నీళ్లు పెట్టుకున్న న‌వ‌నీత్‌, ఓదార్చిన భ‌ర్త.. వైర‌ల్‌ వీడియో

అదేవిధంగా యేవలలోని కాన్హే గ్రామం రైల్వే స్టేషన్‌లో ఒక ప్రత్యేక రైలులో 18 రోజులు సినిమా షూటింగ్‌ జరిగింది. దీనివల్ల సెంట్రల్‌ రైల్వేకు రూ.1.27 కోట్ల ఆదాయం రాగా ఆదార్కి రైల్వే స్టేషన్‌లో 9 రోజుల పాటు జరిగిన షూటింగ్‌ వల్ల రూ.65.95 లక్షల ఆదాయం వచ్చింది. ఇదిలా ఉండగా 2013–14 ఆర్ధిక సంవత్సరంలో సీఎస్‌ఎంటీలో జరిగిన వివిధ షూటింగుల ద్వారా రైల్వేకు రూ.1.73 కోట్ల ఆదాయం వచ్చింది. అప్పట్లో ఈ ఆదాయాన్ని రికార్డుగా భావించారు. ఆ తరువాత ఇప్పుడు రూ.2.48 కోట్ల ఆదాయం రావడం 2013–14 ఆర్ధిక సంవత్సరం రికార్డును బద్దలు కొట్టింది.  

అత్యధికంగా షూటింగులు జరిగే స్టేషన్లు... 
మొదటి స్ధానంలో సీఎస్‌ఎంటీ ఉండగా, ఆ తరువాత స్ధానంలో ముంబైలోని ఓల్డ్‌ వాడిబందర్‌ యార్డ్, దాదర్, ములుండ్‌లోని ఆర్పీఎఫ్‌ గ్రౌండ్, ముంబైకి సమీపంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మాథేరాన్‌ రైల్వే స్టేషన్, సాతారా జిల్లాలోని అదార్కి రైల్వే స్టేషన్, మన్మాడ్‌–అహ్మద్‌నగర్‌ మధ్యలో ఉన్న యేవలలోని కాన్హేగావ్‌ స్టేషన్‌లో జరుగుతాయని సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పీఆర్వో శివాజీ సుతార్‌ తెలిపారు.   

మరిన్ని వార్తలు