సిగ్నల్‌ రాంగ్‌ రూట్‌

5 Jun, 2023 05:07 IST|Sakshi

మూడు నెలల ముందు సంపర్క్‌క్రాంతికి తప్పిన ప్రమాదం

సిగ్నల్‌ వ్యవస్థలో లోపాలు అరికట్టాలంటూ అప్పట్లోనే హెచ్చరికలు

భువనేశ్వర్‌: ఒడిశాలోని మూడు రైళ్లు ఢీకొని 275  మంది ప్రాణాలు బలైపోయిన తర్వాత మన దేశంలో రైల్వే సిగ్నల్‌ వ్యవస్థలో ఉన్న లోటుపాట్లు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. మూడు నెలల ముందే సిగ్నల్‌ వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఉన్నాయంటూ సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే జోన్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ రాసిన లేఖ ఒకటి మీడియాకి చిక్కింది. సిగ్నల్‌ వ్యవస్థలో లోపాలు వెంటనే సవరించకపోతే భారీ ప్రమాదాలు చోటు చేసుకోవడం ఖాయమంటూ ఆ చీఫ్‌ మేనేజర్‌ రైల్వే శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళుతూ ఫిబ్రవరి 9న లేఖ రాశారు.

ఫిబ్రవరి 8వ తేదీన బెంగుళూరు నుంచి న్యూఢిల్లీకి వెళ్లే  సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ భారీ ప్రమాదానికి గురై ఉండాల్సిందని డ్రైవర్‌ అప్రమత్తతతో వ్యవహరించడం వల్ల ముప్పు తప్పిందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. సంపర్క్‌ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణిస్తున్న సమయంలో మెయిన్‌ లైన్‌ ద్వారా వెళ్లవచ్చునని డ్రైవర్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ వచ్చింది. అలా సిగ్నల్‌ వచ్చినప్పుడు పట్టాల దగ్గర ఉండే పాయింట్‌ మారాలి. రైలుని ఒక ట్రాక్‌ నుంచి మరో ట్రాక్‌కి మళ్లించడాన్ని పాయింట్‌ అంటారు. అయితే సిగ్నల్, పాయింట్‌ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి.

దీనిని గమనించిన డ్రైవర్‌ సరైన సమయంలో రైలుని ఆపేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థని సరిగా వినియోగించుకోలేకపోవడం వల్ల ముంచుకొచ్చిన ప్రమాదం ఇదని ఆయన ఆ లేఖలో వివరించారు. సిగ్నలింగ్‌ సాంకేతిక వ్యవస్థపై సమగ్రమైన విచారణ జరపడమే కాకుండా, స్టేషన్‌ మాస్టర్లు, ట్రాఫిక్‌ ఆఫీసర్లు, ట్రావెలింగ్‌ ఇన్‌స్పెక్టర్లపై దీనిపై అవగాహన పెంచే ప్రయత్నాలు చేయాలన్నారు. సిగ్నల్‌ వ్యవస్థని నిరంతరం పర్యవేక్షిస్తూ వెనువెంటనే లోపాలు సరిదిద్దుకోకపోతే ఘోరమైన ప్రమాదాలు చూస్తామని సౌత్‌ వెస్ట్రన్‌ రైల్వే చీఫ్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ మూడు నెలల కిందటే హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు