దివ్యాంగులకు రైల్వేశాఖ అందించే ప్రత్యేక సౌకర్యాలివే..

29 Nov, 2023 13:42 IST|Sakshi

మనలో చాలామంది దూర ప్రయాణాలకు రైలునే ఇష్టపడతారు. రైలు ప్రయాణంలో అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. దివ్యాంగులకు రైల్వేశాఖ ‍ప్రత్యేక సదుపాయాలు, సౌకర్యాలు కల్పిస్తోంది. అంగ వైకల్యం కలిగినవారు, మానసిక వ్యాధిగ్రస్తులు, అంధులు తమ రైలు ప్రయాణంలో ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చు. దివ్యాంగులకు రైలు టిక్కెట్‌ ధరలోనూ రాయితీ లభిస్తుంది. అయితే ఇందుకోసం దివ్యాంగులు తమ అంగవైకల్యానికి సంబంధించిన ధృవీకరణ పత్రం కలిగివుండాలి.

సీటు సౌకర్యం
దివ్యాంగులైన ప్రయాణికులకు ఇది వరం లాంటిది. దివ్యాంగులకు స్లీపర్ క్లాస్‌లో రెండు లోయర్, రెండు మిడిల్ బెర్త్‌లు, ఏసీ-3లో ఒక లోయర్, ఒక మిడిల్ బెర్త్, త్రీఈ కోచ్‌లో ఒక లోయర్ బెర్త్, ఒక మిడిల్ బెర్త్ కేటాయిస్తారు.

టిక్కెట్లపై తగ్గింపు
దివ్యాంగులైన ప్రయాణీకులకు రైలు టిక్కెట్లలో రాయితీ లభిస్తుంది. దివ్యాంగులైన ప్రయాణికులు టిక్కెట్ల ధరలో 25 శాతం నుండి 75 శాతం వరకు రాయితీని పొందవచ్చు. దివ్యాంగులైన ప్రయాణికులకు స్లీపర్ క్లాస్, ఏసీ-3 నుండి సాధారణ తరగతి వరకు అన్నింటా రాయితీలు లభిస్తాయి. ఈ రాయితీని పొందడానికి, టిక్కెట్‌ను కొనుగోలు చేసేటప్పుడు అంగవైకల్య ధృవీకరణ పత్రాన్ని చూపించడం తప్పనిసరి.

చక్రాల కుర్చీ సౌకర్యం
భారతీయ రైల్వే దివ్యాంగులైన ప్రయాణికులకు చక్రాల కుర్చీ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచింది. స్టేషన్ నుండి రైలు వద్దకు వచ్చేందుకు దివ్యాంగులు ఈ వీల్‌చైర్‌ను వినియోగించుకోవచ్చు. ఈ వీల్ చైర్ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు ముందుగా సంబంధిత అధికారి లేదా స్టేషన్ మాస్టర్‌ను సంప్రదించాల్సివుంటుంది. తరువాత రైల్వే సిబ్బంది వీల్‌ చైర్‌ను దివ్యాంగుల దగ్గరకు తీసుకువస్తారు. అయితే ఈ సౌకర్యం పొందేందుకు దివ్యాంగులు కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
ఇది కూడా చదవండి: ఆ 17 రోజులు ఎలా గడిచాయంటే..

మరిన్ని వార్తలు