‘చిన్నారుల టికెట్ల బుకింగ్‌లో మార్పుల్లేవ్‌’.. రైల్వే శాఖ స్పష్టీకరణ

18 Aug, 2022 07:09 IST|Sakshi

న్యూఢిల్లీ: చిన్నారులకు రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే శాఖ వెల్లడించింది. ఒకటి నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు సైతం పెద్దలకు అయ్యే చార్జీనే వసూలు చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ రైల్వే శాఖ 2020 మార్చి 6న ఒక సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే, వారికి ప్రత్యేకంగా బెర్త్‌ గానీ, సీటు గానీ కేటాయించరు. ఒకవేళ బెర్త్‌ లేదా సీటు కావాలనుకుంటే పెద్దలకు అయ్యే రుసుమును చెల్లించి, టికెట్‌ కొనాల్సి ఉంటుంది.

ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆక్షేపించింది. బెర్త్‌ లేదా సీటు అవసరం లేదనుకుంటే ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలియజేసింది.

ఇదీ చదవండి: జార్ఖండ్‌ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్‌

మరిన్ని వార్తలు