Super Vasuki: ఈ గూడ్స్‌కు 295 వ్యాగన్లు!

17 Aug, 2022 05:15 IST|Sakshi

న్యూఢిల్లీ: సాధారణ గూడ్స్‌ రైలు కంటే 3 రెట్లు పెద్దదైన ‘సూపర్‌ వాసుకి’ని ఆగ్నేయ మధ్య(సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌) రైల్వే ప్రయోగాత్మకంగా నడిపింది. మూడున్నర కిలోమీటర్ల పొడవు, 295 వ్యాగన్లతో 27 వేల టన్నులకు పైగా బొగ్గును తీసుకుని ఈ భారీ రైలు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌ సమీపంలోని రాజ్‌నంద్‌గావ్‌కు చేరుకుంది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా సోమవారం సూపర్‌ వాసుకిని నడిపి చూసినట్లు అధికారులు చెప్పారు.

కోర్బా నుంచి మధ్యాహ్నం 1.50 గంటలకు బయలుదేరిన ఈ గూడ్స్‌ 267 కిలోమీటర్ల దూరాన్ని 11.20 గంటల్లో చేరుకుంది. ఒక్కో స్టేషన్‌ను దాటేందుకు వాసుకికి సుమారు 4 నిమిషాలు పట్టింది. ఇప్పటి వరకు నడిపిన అత్యంత పొడవైన, అతి భారీ గూడ్స్‌ రైలు ఇదేనని రైల్వే శాఖ వెల్లడించింది. సూపర్‌ వాసుకి తీసుకువచ్చిన బొగ్గుతో 3,000 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం ఒక రోజంతా నడుస్తుందని అధికారులు చెప్పారు. సాధారణ గూడ్స్‌ రైలు 90 వ్యాగన్లలో 9 వేల టన్నుల బొగ్గును మాత్రమే రవాణా చేయగలుగుతుంది.

మరిన్ని వార్తలు