భారీ వర్షాల ఎఫెక్ట్‌.. ఐదు జిల్లాల్లో స్కూల్స్‌, కాలేజీలు బంద్‌

20 Jul, 2022 11:38 IST|Sakshi

దేశవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని విద్యా సంస్థలకు దాదాపు వారం రోజుల పాటు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. 

తాజాగా ఉత్తరాఖండ్‌లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా మంగళవారం అనేక జిల్లాల్లో కొండచరియలు విరిగిపడటం, భారీ వరదలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఐదు రహదారులను అధికారులు మూసివేశారు. ఇక, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.

ఈ క్రమంలో విద్యాశాఖ అధికారులు అప్రమతమయ్యారు. బాగేశ్వర్, తెహ్రీ, పౌరి, పితోరాఘర్, నైనిటాల్ జిల్లాల్లో 1-12వ తరగతి వరకు పాఠశాలలు, అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు బుధవారం మూసివేసినట్టు తెలిపారు. ఇక, డెహ్రాడూన్, టెహ్రీ, పౌరీ, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్, హరిద్వార్ జిల్లాలకు జూలై 20న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. 

ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం జోషిమత్‌లోని పుర్సరి వద్ద జాతీయ రహదారి ఎన్‌హెచ్-58 కుంగిపోయింది. దీంతో, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరోవైపు.. దేశ రాజధాని ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్‌ ప్రకటిచింది. 

మరిన్ని వార్తలు