వరుణుడి దెబ్బ.. 2000పైగా శవాలు బయటపడ్డాయి

16 May, 2021 20:14 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో గంగా న‌ది తీరం వద్ద ఇసుకలో పాతిపెట్టిన వేలాది సమాధులు బయటపడ్డాయి. ఒక‌వైపు భారీ సంఖ్య‌లో కోవిడ్‌ మ‌ర‌ణాలు నమోదు .. మరోవైపు శ‌వాల‌ను కాల్చేందుకు శ్మశానవాటికలు కూడా సరిపోకపోవడం లాంటి కారణాలతో చాలా మంది త‌మ వారిని ఇలా ఇసుక‌లో సమాధి చేసి వెళ్లి పోతున్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో చేప‌లు ప‌ట్టేందుకు వెళ్లిన జాలర్ల ఆ ప్రాంతంలో 71 మంది మృత‌దేహాల‌ను గుర్తించిన‌ట్లు బిహార్ బ‌క్స‌ర్ జిల్లా అధికారులు స‌మాచారం ఇచ్చారు.  ఈ ఘటన జరిగిన ఐదు రోజుల త‌ర్వాత వానలు పడడం కారణంగా ఇలా 2 వేల‌కు పైగా మృత‌దేహాలు గంగా నది పరివాహక ప్రాంతాల్లో బ‌య‌ట‌ప‌డ్డాయి. శ‌వ ద‌హ‌నానికి డ‌బ్బులు ఖ‌ర్చు చేయ‌లేక, మృత‌దేహాల‌ను ఖననం చేయడానికి శ్మశానవాటికలు సరిపడక ఇలా గంగా న‌ది తీరంలోని ఇసుక‌లో పైపైనే స‌మాధుల మాదిరిగా క‌ట్టికొందరు చేతులు దులుపుకుంటున్నారు. యూపీ, బీహార్  రెండూ రాష్ట్రాలు కలిపి 1,400 కిలోమీటర్ల కంటే ఎక్కువ గంగా నది ప్రవహిస్తుంది. యూపీలోని కాన్పూర్, ఘాజిపూర్, ఉన్నవో, బాలియా జిల్లాల్లో మృతదేహాలను డంపింగ్ చేసే ధోరణి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించామని ఎంహెచ్‌ఏ వర్గాలు తెలిపాయి. రెండు రాష్ట్రాలు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని కోరారు. ఇటీవలే మృత‌దేహాలు గంగా న‌దిలో తేలుతూ కింది ప్రాంతాల‌కు వ‌చ్చిన సంద‌ర్భంలో క‌ల‌క‌లం రేపిన సంగతి తెలిసిందే.

( చదవండి: Covid Vaccination in India: వ్యాక్సిన్‌లోనూ వివక్ష..! )

మరిన్ని వార్తలు