Nilagiri: భారీ వర్షాలు.. నీలగిరుల్లో హై అలర్ట్‌

30 Aug, 2021 08:11 IST|Sakshi
నీలగిరులు(ఫొటో: ట్విటర్‌ యూజర్‌)

కోవైలోనూ అప్రమత్తం 

భారీ వర్షాలకు అవకాశం 

మరో మూడు జిల్లాలపై ప్రభావం

సాక్షి, చెన్నై: నీలగిరుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హై అలర్ట్‌ ప్రకటించారు. ఆదివారం నీలగిరుల్లోని అవలాంజీలో 9 సె.మీ వర్షం పడింది. ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో తరచూ వర్షాలు పడుతున్నాయి. శనివారం నుంచి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. చెన్నై శివారుల్లో రాత్రంతా వర్షం పడింది. కోయంబత్తూరు, నీలగిరుల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. అవలాంజి పరిసరాల్లో 9 సె.మీ, కోయంబత్తూరులో 8 సె.మీ వర్షం కురిసింది.

దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయయ్యాయి. వాగులు వంకల్లోకి నీటి రాక పెరిగింది. నీలగిరి, కోయంబత్తూరులో ఆదివారం నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రధానంగా నీలగిరుల్లో 400 ప్రత్యేక శిబిరాలు ఏర్పటు చేశారు. జాతీయ విపత్తుల నివారణ బృందాలను రంగంలోకి దించారు. కొండ ప్రాంతాలు, తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. 

ఐదు జిల్లాల్లో మోస్తరుగా... 
కోయంబత్తూరు, నీలగిరుల్లో భారీ వర్షం, తేని, దిండుగల్, తెన్‌కాశి, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో సోమవారం నుంచి మూడు రోజులు మోస్తరుగా వర్షం పడుతుందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. కన్యాకుమారి తీరంలో గాలి ప్రభావం అధికంగా ఉంటుందని, జాలర్లు చేపల వేటకు దూరంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఆయా జిల్లా కలెక్టర్లు ముందు జాగ్రత్త చర్యలను విస్తృతం చేశారు. చెన్నైలో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని, అప్పుడప్పుడు వర్షం పలకరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. తెన్‌ కాశిలో కురుస్తున్న వర్షాలకు పశ్చిమ పర్వత శ్రేణుల్లోని కుట్రాలం జలపాతంలో నీటి ఉధృతి పెరిగింది. 

చదవండి: Ooty: ఆ అందాలు ఆస్వాదించాలంటే ఊటీ వెళ్లాల్సిందే!

మరిన్ని వార్తలు