Viral Video: నీటిని వృథా చేస్తున్నారా.. మేలుకోకపోతే తప్పదు భారీ మూల్యం.. 

1 Dec, 2022 19:44 IST|Sakshi

ఎంతో మంది తమకు తెలియకుండానే నీటిని చాలా వరకు వృథా చేస్తుంటారు. ఫ్రీగా వచ్చాయి కదా అని.. కులాయి ఆన్‌చేసి కొద్దిపాటి అవసరానికి కూడా పెద్ద మొత్తంలో నీటిని పారబోస్తుంటారు. అలాంటి ఈ వీడియో తప్పనిసరిగా చూడాల్సిందే..

దేశంలో మంచినీరు దొరకని ప్రాంతాలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాల్లో రాజస్థాన్‌ కూడా ఒకటి. కాగా, రాజస్థాన్‌లోని ఎడారి సమీపంలో నివసించే ప్రజలు మంచినీటి కోసం ప్రతీరోజు ఎంత కష్టాన్ని ఎదుర్కొంటారో ఈ వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ సామ్రాట్ గౌడ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక, ఈ వీడియోలో ఎడారి ప్రాంతంలో ఉన్న ఓ బావి వద్ద ఓ వ్యక్తి కొన్ని సంచులతో చేసిన ఓ కుండలాంటి వస్తువును తయారుచేశాడు. అనంతరం.. దాన్ని బావిలోకి వదులుతాడు.. తర్వాత ఆ తాడును రెండు ఒంటెలు లాగేలా ఉన్న పరికరానికి తగిలిస్తాడు. దీంతో, ఆ రెండు ఒంటెలు తాడును తాగుతూ ముందుకు వెళ్లగానే సంచిలో నీరుపైకి వస్తుంది. అనంతరం, ఆ నీటిని పక్కనే ఉన్న ఓ సంపులో భద్రపరుచుకుంటున్నారు. ఇక, ఈ వీడియోకు ఐఎఫ్‌ఎస్‌ ఆఫీసర్‌ సామ్రాట్‌ గౌడ.. నీరు చాలా విలువైనది, చాలా జాగ్రత్తగా వాడండి అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు. 

ఈ వీడియోపై పలువురు నెటిజన్లు స్పందించారు. వీడియో జైసల్మేర్‌కి చెందినదని ఓ నెటిజన్‌ పేర్కొన్నారు. మరో నెటిజన​్‌ స్పందిస్తూ.. రాజస్థాన్‌ బోర్డర్‌లో ఉన్న వారికి వేసవిలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు వాటర్‌ అందిస్తారని చెప్పుకొచ్చారు. మరో నెటిజన్‌.. అనుభవం మాత్రమే పాఠాన్ని నేర్పుతుంది. నీటి విషయంలో మనం తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అది మనిషి స్వభావం అంటూ ఘాటు కామెంట్స్‌ చేశారు. 

మరిన్ని వార్తలు