Borewell: 16 గంటల ఆపరేషన్‌, బాలుడు సేఫ్‌

7 May, 2021 14:17 IST|Sakshi

జైపూర్‌: దేశంలో పలు చోట్ల బోరు బావుల్లో చిన్నారులు పడిన ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఆయా ఘటనల్లో కొందరు పిల్లలు ప్రాణాలు విడువగా.. మరికొందరు బతికి బయటపడ్డారు. అయితే, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం ఉండటం లేదు. బోరు బావుల యజమానులు కొందరు తమ దారి తమదే అన్నట్లు వ్యవహరిస్తుండటంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజ‌స్థాన్‌లోని జాలోర్ జిల్లాలో ఓ బాలుడు ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో పడిపోయాడు. పిల్లాడిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

నిర్లక్ష్యమే బాలుడిని ప్రమాదంలో పడేసింది
వివరాల్లోకి వెళితే.. జాలోర్ జిల్లాలోని ల‌చ్‌హ్రీ అనే గ్రామానికి చెందిన రైతు నాగరమ్ దేవసీ త‌న వ్య‌వ‌సాయ పొలంలో రెండు రోజుల క్రితం బోరు వేయించాడు. నాగారామ్ కొడుకు అనిల్ దేవాసీ ప్ర‌మాద‌వ‌శాత్తు ఆ బావిలో జారి ప‌డిపోయాడు. ఆ బావి సుమారు 95 అడుగులు లోతు ఉంది. ఇదంతా గ‌మ‌నించిన ఓ వ్యక్తి.. చుట్టుప‌క్క‌ల‌వారికి విష‌యం చెప్పాడు. దీంతో వారు పోలీసుల‌కు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ టీంకు స‌మాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గురువారం మధ్యాహ్నం నుంచి సుమారు 16 గంటల తీవ్రంగా శ్రమించిన అనంతరం బాలుడిని బావిలోంచి బయటకు తీశారు. ప్రస్తుతం బాలుడు సురక్షితంగా ఉన్నట్లు సమాచారం. 

ఆక్సిజన్‌తో నిలిచిన ప్రాణం..
స్థానిక ఎస్‌హెచ్‌వో ఆచార్య మాట్లాడుతూ.. ‘బాలుడు బోరు బావిలో పడిపోయాడని సమాచారం అందగానే హుటాహుటిన అక్కడకు చేరుకున్నాం. పిల్లాడి వద్దకు కెమెరా పంపించి అతని క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నాం. పిల్లాడికి పైపు ద్వారా ఆక్సిజ‌న్‌ను, ఆహార ప‌దార్థాలు కూడా బావిలోకి పంపించాము. అలాగే బాలుడు నిద్రపోకుండా ఉండటానికి మా జట్టు సభ్యులు నిరంతరం కమ్యూనికేట్ చేస్తూ ఉన్నాం. సహాయక కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగాయి. బాలుడిని క్షేమంగా బయటకు తీయగలిగాం’అని చెప్పారు.

( చదవండి:  అలర్ట్: ముంచుకొస్తున్న ‘ఫ్లూబోట్‌’ ముప్పు )

మరిన్ని వార్తలు