పెళ్లి 3 గంటల్లో పూర్తవ్వాలి, 31 మందికే చాన్స్‌, లేదంటే..

4 May, 2021 09:21 IST|Sakshi

పెళ్లిళ‍్లపై రాజస్తాన్‌ కొత్త మార్గదర్శకాలు

అతిథుల సంఖ్య పెరిగితే కఠిన చర్యలు

31 కి దాటకుండా చూసుకోవాలంటూ ఆదేశాలు 

జైపూర్‌: పెళ్లి..రెండు మనసులు ఏకం చేసే అపురూప వేడుక. ఆ అపురూపమైన ఘట్టాన్ని బంధుమిత్రుల సమక్షంలో కలకాలం గుర్తుండి పోయేలా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ, ఆ పెళ్లి వేడుకపై మహమ్మారి విజృంభిస‍్తుంది. దీంతో పెళ్లిళ్లు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పుడు పెళ్లి వేడుకలన్నీ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పోలీసుల పహారా మధ్య జరుపుకోవాల్సిన పరిస్థితులు దాపురించాయి. అయినప్పటికీ కరోనా వ్యాప్తి మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పెళ్లి వేడుకలపై కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. 

తాజాగా పెళ్లిళ్లకు సంబంధించి రాజస్తాన్‌ ప్రభుత్వం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. పెళ్లికి వచ్చే అతిథుల సంఖ్యను గతంలో 50కి పరిమితం చేసిన గహ్లోత్‌ ప్రభుత్వం.. ఆ సంఖ్యను 31 కి కుదిస్తూ నిర్ణయం తీసుకుంది. పెళ్లిలో ఆ సంఖ్య కన్నా ఒక్కరు పెరిగినా లక్షరూపాయలు ఫైన్‌ కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దాంతోపాటు వివాహ తంతును మూడుగంటల్లోగా పూర్చి చేయాలని, ఆ సమయం మించితే లక్ష రూపాయల జరిమానా తప్పదని తెలిపింది.

అలాగే తప్పుడు సమాచారంతో అధికారుల సమయాన్ని వృథా చేసినవారికి రూ.5 వేలు జరిమానా విధించాల్సి ఉంటుందని వెల్లడించింది. అవసరమైనప్పుడు కుటుంబ సభ్యులు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్‌ కు సంబంధిత పెళ్లి ఫోటోల్ని తప్పని సరిగా చూపించాలని రాజస్థాన్‌ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల్లో వివరించింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మే 17 వరకు లాక్‌ డౌన్‌ ఆంక్షల్ని పొడిగించిన విషయం తెలిసిందే. కాగా, సోమవారం రాజస్థాన్‌లో కొత్తగా 17,296 కోవిడ్ కేసులు నమోదవ్వగా 154 మంది మరణించారు. 

మరిన్ని వార్తలు