అసెంబ్లీ భేటీ : గవర్నర్‌ ముందుకు మరో ప్రతిపాదన

28 Jul, 2020 12:28 IST|Sakshi

కాంగ్రెస్‌కు గుణపాఠం : మాయావతి

జైపూర్‌ : రాజస్తాన్‌లో అశోక్‌ గహ్లోత్‌ సర్కార్‌పై ఆ పార్టీ సీనియర్‌ నేత సచిన్‌ పైలట్‌ తిరుగుబాటుతో నెలకొన్న రాజకీయ హైడ్రామా కొనసాగుతోంది. అసెంబ్లీ సమావేశాలపై కేబినెట్‌ నుంచి తాజా ప్రతిపాదనను గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా కోరడంతో ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలో​  కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. గవర్నర్‌ పంపిన మార్గదర్శకాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై  గవర్నర్‌కు మంత్రిమండలి మరోసారి విజ్ఞప్తి చేస్తుందని గహ్లోత్‌ శిబిరం పేర్కొంది.

​కాగా అసెంబ్లీని సమావేశపరచాలని అంతకుముందు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను తోసిపుచ్చుతూ గవర్నర్‌ పంపిన నోట్‌లో పలు అంశాలను ప్రస్తావించారు. ఆ నోట్‌లో ‘21 రోజుల నోటీస్‌ వ్యవధికి ప్రభుత్వం అంగీకరిస్తే శాసనసభను సమావేశపర్చవచ్చు. లేదా, సమావేశం ఎజెండా బలనిరూపణే అయితే, ఆ నోటీస్‌ కాల వ్యవధిని తగ్గించవచ్చు. ఒకవేళ విశ్వాస పరీక్ష జరిగితే.. ఆ మొత్తం కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయాల’ని పేర్కొన్నారు.

అయితే రాజస్తాన్‌ అసెంబ్లీలో బీజేపీ తన పరిస్థితి మెరుగుపర్చుకునేందుకు అసెంబ్లీ సమావేశాలకు ముందు 21 రోజుల నోటీసు ఇవ్వాలన్న నిబంధనను తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌ ఆరోపించింది. ఇది ప్రలోభాలకు ఆస్కారం ఇచ్చినట్టేనని, కాంగ్రెస్‌ సహా మిత్రపక్షాలు ఇలాంటి కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ సీనియర్‌ నేత అధీర్‌ రంజన్‌ పేర్కొన్నారు. కాగా బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై కాంగ్రెస్‌ పార్టీకి, ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌కు గుణపాఠం చెబుతామని విలీనాన్ని సవాల్‌ చేస్తూ న్యాయస్ధానాన్ని ఆశ్రయించిన ఆ పార్టీ అధినేత్రి మాయావతి హెచ్చరించారు. ఇక కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఓ బీజేపీ ఎమ్మెల్యే రాజస్తాన్‌ హైకోర్టులో మంగళవారం తాజా పిటిషన్‌ దాఖలు చేశారు. చదవండి : మళ్లీ మార్చి పంపండి!

మరిన్ని వార్తలు