మమతకు గుడ్‌న్యూస్‌: అండగా కాంగ్రెస్‌ సీఎం

1 Apr, 2021 20:49 IST|Sakshi

జైపూర్‌: ‘ఎన్నికల తర్వాత పోరాటానికి ఏకమవుదాం’ అని పిలుపునిచ్చిన పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీకి ఓ ముఖ్యమంత్రి అండగా నిలిచారు. ఈ సందర్భంగా మమత
పోరాటానికి అండగా ఉంటానని ప్రకటించారు. మమత ప్రకటనపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆయనే రాజస్థాన్‌‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ (కాంగ్రెస్‌). కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరుస్తోందని మమత చేసిన వ్యాఖ్యలకు తాను మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా గురువారం రెండు ట్వీట్లు చేశారు. ‘ప్రధానమంత్రి ఒకచేత్తో ప్రజాస్వామ్యం, మరో చేత్తో రాష్ట్రాలను బలహీనం చేస్తున్నారు’ అని అశోక్‌ గెహ్లాట్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్రాల పథకాల అమలులో కేంద్రం వాటా తగ్గించుకుని రాష్ట్రాల వాటా పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఎస్టీ చెల్లింపులు మొత్తం చేయడం లేదని ఆరోపించారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల విషయంలో కూడా కేంద్రం వైఖరిని తప్పుబట్టారు. ప్రత్యేక పన్ను, అదనపు పన్నులు వేస్తూ దండుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రాల మధ్య అధికార పంపిణీ, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల్లో కేంద్రం తన పాత్ర తగ్గించుకుంటోందని తెలిపారు. 

అంతకుముందు రోజు అస్సాంలో కాంగ్రెస్‌ మద్దతుదారులకు చేపట్టిన ప్రచారంలో అశోక్‌ గెహ్లాట్‌ కేంద్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, సమాఖ్య విధానానికి తూట్లు పొడుస్తోందని మమత ఆరోపిస్తూ బీజేపీయేతర పార్టీల నాయకులకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖకు అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. అయితే ఇతర పార్టీల నాయకులు ఇంకా స్పందించలేదు. వారి వైఖరి ప్రకటిస్తే జాతీయ రాజకీయాల్లో కొంత ప్రభావం ఉండే అవకాశం ఉంది.

చదవండి: ‘కూల్‌.. కూల్‌ దీదీ.. మేం 200 సీట్లు గెలుస్తాం’
చదవండి: ‘మీ భార్యకు ఎలా ఉంది ఉద్దవ్‌జీ‌?

మరిన్ని వార్తలు