హస్తంలో బీటలు.. కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌లు.. పీసీసీ, ఎమ్మెల్యే ఔట్‌

18 May, 2022 20:24 IST|Sakshi

దేశంలో కాం‍గ్రెస్‌పార్టీకి రోజుకో షాక్‌ తగులుతోంది. ఇటీవల సంస్థాగత మార్పులే లక్ష్యంగా రాజస్థాన్‌ వేదికగా చింతన్‌ శిబిర్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇంతలోనే రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ పార్టీకి భారీ షాక్‌ తగిలింది. 

రాజ‌స్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీఎం అశోక్‌ గెహ్లాట్‌ అత్యంత సన్నిహితుడైన గ‌ణేశ్ ఘోగ్రా.. హస్తం పార్టీకి హ్యాండిచ్చారు. బుధవారం కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. గణేశ్‌ ఘోగ్రా.. రాజ‌స్థాన్‌లోని డంగార్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. అయితే, తాను సీనియర్‌ ఎమ్మెల్యే అయిన‌ప్ప‌టికీ.. పార్టీలో తగిన గుర్తింపు లేకపోవడం, ప్రజా సమస్యలు చెప్పినా.. పార్టీలో ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. అందుకే రాజీనామా చేస్తున్నాన‌ని ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ఈ సందర్భంగా త‌న రాజీనామాను అసెంబ్లీ స్పీక‌ర్‌కు, సీఎం గెహ్లాత్‌కు, పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పంపినట్టు స్పష్టం చేశారు.

మరోవైపు.. గుజరాత్‌లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవికి రాజీనామా చేస్తు‍న్నట్లు ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. ‘నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్‌ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్‌ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నాను’ అని ట్విటర్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని వార్తలు