ఇదేం ట్విస్ట్‌.. కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ఇంకా గెహ్లాట్! కానీ..

27 Sep, 2022 17:05 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరిలో అధిష్టానం చాయిస్‌గా తానే నిలవాలని  ఆ పార్టీ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ భావించారు. పార్టీ పగ్గాలతో పాటు సీఎంగానూ కొనసాగాలని ఆశపడ్డారు. అయితే ఒక వ్యక్తి.. ఒకే పదవి సవరణ ఆయన దూకుడుకు బ్రేకులు వేయించింది. ఈ క్రమంలో తన వారసుడిని తన ఇష్ట ప్రకారం ఎంచుకోవాలనుకున్న ప్రయత్నం బెడిసి కొట్టి.. రాజకీయ సంక్షోభానికి దారి తీసింది కూడా. 

అయితే అధ్యక్ష ఎన్నికల బరి నుంచి గెహ్లాట్‌ వైదొలిగారన్న ప్రచారానికి తెర పడేలా మరో ప్రచారం ఇప్పుడు మొదలైంది. పార్టీ అధిష్టానం ఆయన్ని కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోమని ఆదేశాలు ఇవ్వలేదట. అలాగే.. తనంతట తాను తప్పుకుంటానని నిన్న(సోమవారం) సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే వద్ద గెహ్లాట్‌ ప్రస్తావించినట్లు వస్తున్న వార్తల్లోనూ వాస్తవం లేదని పార్టీ వర్గాలు స్పష్టం చేశాయి.

ఈ మేరకు రాజస్థాన్‌ పరిణామాలపై సీనియర్‌ నేత అజయ్‌ మాకెన్‌- సమర్పించిన నివేదిక.. ఇప్పుడు కీలకంగా మారనున్నట్లు సమాచారం. మరో 48 గంటల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన వస్తుందని, ఈ లెక్కన ప్రస్తుతానికి కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసులో గెహ్లాట్‌ ఉన్నట్లేనని పార్టీ సీనియర్‌ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఎమ్మెల్యేల తిరుగుబాటుతో తనకు సంబంధం లేదని గెహ్లాట్‌ చెప్పడంతో.. పార్టీ అధినేత్రి(తాత్కాలిక) సోనియాగాంధీని కలుసుకుని వివరణ ఇచ్చే అవకాశం ఆయనకు ఇచ్చినట్లు సమాచారం. అయితే.. గెహ్లాట్‌ సంగతి పక్కనపెడితే ‘రెబల్‌’ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలనే యోచనలో అధిష్టానం ఉంది.

ఇదిలా ఉంటే.. ఒకవైపు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కోసం సీనియర్‌ నేత శశిథరూర్‌ నామినేషన్‌ పేపర్లను తీసుకున్నారు. ఈ నెల 30న ఆయన నామినేషన్‌ వేసే అవకాశం ఉంది. మరోవైపు రాజస్థాన్‌ సంక్షోభానికి కారణమైన ఎమ్మెల్యే సచిన్‌ పైలట్‌.. ఢిల్లీకి వెళ్లి అధిష్టానంతో మంతనాలకు సిద్ధమయ్యాడు. ఇంకోవైపు అధిష్టానం సీరియస్‌ అయిన నేపథ్యంలో చల్లబడ్డ ఎమ్మెల్యేలు తామంతా ఒకేతాటిపై ఉన్నామంటూ ప్రకటనలు ఇస్తున్నారు.

ఇదీ చదవండి: ఢిల్లీ తర్వాత ఇప్పుడు పంజాబ్‌లోనూ సేమ్‌ సీన్‌

మరిన్ని వార్తలు