రాజస్థాన్‌లో కాంగ్రెస్‌లో ఆ ముగ్గురిదే ధిక్కారం.. గెహ్లాట్‌ తప్పేం లేదంటూ నివేదిక!

27 Sep, 2022 21:06 IST|Sakshi

ఢిల్లీ: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం వెనుక సీఎం అశ్లోక్‌ గెహ్లాట్‌ తప్పేం లేదని కాంగ్రెస్‌ అధిష్టానానికి అందిన నివేదికలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు గుజరాత్‌ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి అజయ్‌ మాకెన్‌.. సోనియా గాంధీకి అందించిన నివేదికలో గెహ్లాట్‌కు క్లీన్‌ చిట్‌ దక్కినట్లు సమాచారం.

ఆదివారం నాటి రాజస్థాన్‌ పరిణామాలను దగ్గరుండి అజయ్‌ మాకెన్‌ గమనించారు. ఒకవైపు సీఎల్పీ సమావేశం జరుగుతుంటే.. ఎమ్మెల్యేలంతా ఆ సమావేశానికి గైర్హాజరు కావడం, అదే సమయంలో మరో నేత ఇంట్లో ప్రత్యేకంగా సమావేశం కావడం, ఆపై 82 మంది ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామా సమర్పించి అధిష్టాన నిర్ణయాన్ని వ్యతిరేకించడం లాంటి పరిణామాలు తెలిసినవే. అయితే.. 

ఎమ్మెల్యేల తిరుగుబావుటా వెనుక తొలుత గెహ్లాట్‌ ఉండి ఉంటారని, తన ఇష్ట ప్రకారం తర్వాతి వారసుడిని ఎంపిక చేసుకునే అవకాశం ఇవ్వనందునే(సచిన్‌ పైలట్‌ పేరు సీఎం రేసులో నిలవడంపై వ్యతిరేకత) ఆయన ఇలా చేసి ఉంటారని కాంగ్రెస్‌ సీనియర్లలో జోరుగా చర్చ జరిగింది. దీంతో గెహ్లాట్‌(71) తీరుపై అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి పోటీ నుంచి ఆయన తప్పుకుంటారనే చర్చ సైతం తెరపైకి వచ్చింది. అయితే.. 

సోనియాగాంధీకి అజయ్‌ మాకెన్‌ సమర్పించిన నివేదికలో.. ముగ్గురు ఎమ్మెల్యేల వల్లే తిరుగుబాటు పరిణామాలు సంభవించినట్లు పేర్కొన్నారు. అశోక్‌ గెహ్లాట్‌ ప్రమేయం లేకుండానే ఈ పార్టీ వ్యతిరేక చర్య నడిచిందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. పార్టీ చీఫ్‌ విప్‌ మహేష్‌ జోషి, ఆర్‌టీడీసీ చైర్మన్‌ ధర్మేంద్ర పాథక్‌, ఎమ్మెల్యేలను తన ఇంట్లో సమావేశపర్చిన మంత్రి శాంతి ధారివాల్‌ పేర్లు ఆ నివేదికలో ఉన్నాయి. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకోవాలని సోనియాను మాకెన్‌ కోరినట్లు సమాచారం. 

ఆదివారం విడిగా జరిగిన ఎమ్మెల్యేల ప్రత్యేక సమావేశంలో 2020 నాటి సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు ప్రత్యేకంగా ప్రస్తావనకు వచ్చినట్లు, ఆ సమయంలో ప్రభుత్వాన్ని స్థిరపరిచిన వ్యక్తుల్లో ఒకరినే గెహ్లాట్‌ వారసుడిగా, రాజస్థాన్‌ తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నుకోవాలంటూ ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలంతా తీర్మానం చేశారు. కాదని పైలట్‌ను గనుక ముఖ్యమంత్రిని చేస్తే.. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని బెదిరించారు కూడా. అంతేకాదు.. అధినేత్రి సోనియా ఆదేశాలను పక్కనపెట్టడంతో పాటు కేంద్రంలోని కీలక నేతలకు కలిసేందుకు, డిమాండ్లు వినిపించేందుకు సైతం ఆ ఎమ్మెల్యేలంతా విముఖత వ్యక్తం చేసినట్లు తేలింది. ఇక ఈ నివేదికను సమర్పించే ముందు ఎమ్మెల్యేలంతా క్రమశిక్షణతో లేరంటూ మాకెన్‌ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు