Jaipur Blast Case: రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు.. 71 మంది చనిపోయిన పేలుళ్ల కేసు నిందితుల ఉరిశిక్ష రద్దు

29 Mar, 2023 18:46 IST|Sakshi

జైపూర్‌: రాజస్థాన్ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. 71 మంది మరణించి, 180 మంది గాయపడిన 2008 జైపూర్ వరుస పేలుళ్ల కేసులో నిందితుల్లో నలుగురికి ఉరిశిక్షను రద్దు చేసి నిర్దోషులుగా విడుదల చేసింది.  2019 డిసెంబర్‌లోనే వీరికి ట్రయల్ కోర్టు మరణశిక్ష విధించడం గమనార్హం. నలుగురు నిందుతుల పేర్లు.. మహమ్మద్ సల్మాన్, మహమ్మద్ సైఫ్, సర్వార్ ఆజ్మీ, సైఫురెహ్మాన్ అన్సారీ.

జస్టిస్ పంకజ్ భండారీ, జస్టిస్ సమీర్ జైన్‌తో కూడిన డివిజన్ బెంచ్ 28 అ‍ప్పీళ్లను ఆమోదించి ఈమేరకు తీర్పు వెలువరించింది. ఈ కేసు నిందితుల్లో ఒకరిని నిర్దోషిగా ప్రకటించిన దిగువ కోర్టు తీర్పును సమర్థించింది.

వరుస పేలుళ్లతో జైపూర్ షేక్..
2008 మే 13న జైపూర్ వరుస పేలుళ్లతో ఉలిక్కిపడింది. ఈ ఘటనల్లో మొత్తం 71 మంది చనిపోయారు. 180మందికిపైగా గాయపడ్డారు. ఓ సైకిల్‌పై ఉన్న స్కూల్‌ బ్యాగ్‌లో లైవ్ బాంబు కూడా లభ్యమైంది.  ఈ కేసుకు సంబంధించి మొత్తం 13 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. 8 ఎఫ్‌ఐర్‌లు నమోదయ్యాయి. 1,293 మంది సాక్షులను విచారించారు. నిందితుల్లో ముగ్గురు హైదరాబాద్, ఢిల్లీ జైలులో ఉన్నారు. మరో ముగ్గురు ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఇద్దరు బత్లా హౌస్ ఎన్‌కౌంటర్‍లో హతమయ్యారు. నలుగురు జైపుర్‌ జైల్లో ఉన్నారు.
చదవండి: 2025 కాదు 2050లో కూడా బీజేపీ గెలవదు.. కేజ్రీవాల్ జోస్యం..

మరిన్ని వార్తలు