‘అరుణ్‌ శౌరీపై క్రిమినల్‌ కేసు పెట్టండి’

17 Sep, 2020 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి  అరుణ్ శౌరీతోపాటు, ప్రభుత్వ మాజీ ఉద్యోగి ప్రదీప్ బైజల్, హోటలియర్ జ్యోత్స్నా సూరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీబీఐ కోర్టు గురువారం ఆదేశాలిచ్చింది. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌ లక్ష్మి విలాస్ ప్యాలెస్ హోటల్‌లో పెట్టుబడుల్లో అవినీతి జరిగిందన్న కేసులో అరుణ్ శౌరీని ప్రత్యేక సీబీఐ కోర్టు నిందితుడిగా పేర్కొంది. హోటల్ అమ్మకాన్ని తిరిగి ప్రారంభించాలని కోర్టు సూచించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో పెట్టుబడుల మంత్రిగా అరుణ్ శౌరీ ఉన్న సమయంలో ప్రభుత్వానికి భారీ నష్టంతో ఈ హోటల్‌ను విక్రయించినట్లు గుర్తించింది. హోటల్ లక్ష్మి విలాస్ విలువ రూ.252 కోట్లకు పైగా ఉండగా.. కేవలం రూ.7.5 కోట్లకు అమ్ముడైందని కోర్టు తీర్పులో పేర్కొంది. కాగా, సీబీఐ కోర్టు తీర్పుపై రాష్ట్ర హైకోర్టుకు వెళ్తానని అరుణ్‌ శౌరీ స్పష్టం చేశారు.

ప్యాలెస్‌ చరిత్ర ఇది
ఫతే సాగర్ ఒడ్డున ఉన్నఈ ప్యాలెస్‌ ఉదయ్‌పూర్‌ రాజులకు చెందినది. రాజరిక పాలన చివరి రోజుల్లో ఈ ప్యాలెస్‌ని ప్రభుత్వానికి అప్పగించారు. భారత్‌ స్వతంత్ర దేశంగా మారిన తర్వాత ప్రభుత్వం దీనిని హోటల్‌గా నడిపింది. 2002లో దీనిని లలిత్ సూరి గ్రూప్ హోటల్స్‌ సంస్థ కొనుగోలు చేసింది. ఆసమయంలోనే కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని అభియోగాలు నమోదయ్యాయి. అయితే, సరైన ఆధారాలు లేవని 2019లో సీబీఐ కేసు మూసివేతకు నివేదిక సిద్ధం చేసింది. కానీ, జోధ్‌పూర్‌లోని ప్రత్యేక కోర్టు ఈ నివేదికను తిరస్కరించి తదుపరి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం దీని లలిత్ లక్ష్మీ విలాస్ ప్యాలెస్ అని పిలుస్తున్నారు. లలిత్ సూరి మరణించడంతో సంస్థ బాధ్యతలు జ్యోత్స్నా సూరి నిర్వర్తిస్తున్నారు.
(చదవండి: వైరల్‌‌: కూతురి డైట్‌పై తండ్రి సరదా కామెంట్‌)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా