రసవత్తరంగా రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్‌ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు

26 Sep, 2022 14:43 IST|Sakshi

రాజస్థాన్‌ రాజకీయం రసవత్తరంగా మారింది. అశోక్‌ గెహ్లాట్‌ స్థానంలో రాజస్థాన్‌ కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే వ్యవహారం.. పార్టీలో కల్లోలం రేపింది. అధిష్టాన అనుకూలుడైన సచిన్‌ పైలెట్‌ పేరును వ్యతిరేకిస్తూ గెహ్లాట్‌ మద్దతుదారుల రాజీనామా ఎపిసోడ్‌తో ప్రభుత్వమే కుప్పకూలే పరిస్థితికి చేరుకుంది. ఈ తరుణంలో.. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యులు స్పందించారు. 

న్యూఢిల్లీ: అశోక్‌​ గెహ్లాట్‌ను కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలని కాంగ్రెస్‌ అధినేత్రి(తాతాల్కిక) సోనియా గాంధీని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ మేరకు వేరే ఎవరినైనా ఎంపిక చేయాలంటూ కోరుతున్నారు. ఆయన మీద నమ్మకంతో.. బాధ్యతలు అప్పగించడం ఏమాత్రం సరికాదు. పార్టీ అధిష్టానం ఆయన అభ్యర్థిత్వాన్ని పునఃపరిశీలించాలి అని కోరుతున్నారు సీడబ్ల్యూసీ సభ్యులు. ఎమ్మెల్యేలను నియంత్రించకుండా.. తెర వెనుక ఉంటూ ఆయన డ్రామాలు ఆడిస్తున్నారంటూ కొందరు సభ్యులు వ్యాఖ్యానించడం గమనార్హం​.

ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం నాటి పరిణామాలను సోనియా గాంధీకి వివరించినట్లు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే మీడియాకు వెల్లడించారు. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంతా కట్టుబడి ఉండాలని, పార్టీలో క్రమశిక్షణ ఉండి తీరాల్సిందేనని సోమవారం మధ్యాహ్నాం గెహ్లాట్‌తో భేటీ అనంతరం ఖర్గే వ్యాఖ్యానించారు.

ఇక గాంధీ కుటుంబానికి విధేయులుగా ఉండి.. సీనియర్‌ సభ్యుడిగా ఉన్న వేరే ఎవరినైనా అశోక్‌ గెహ్లాట్‌ స్థానంలో ఎంపిక చేయండని కోరుతున్నారు సీడబ్ల్యూసీ సభ్యులు. ఇదిలా ఉంటే..ఆదివారం సాయంత్రం జరిగిన  సీఎల్పీ(కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ) భేటీకి గెహ్లాట్‌ క్యాంప్‌లోని ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడం, మంత్రి శాంతి ధారివాల్‌ ఇంట్లో వేరుగా భేటీ కావడం, స్పీకర్‌ సీపీ జోషికి 92 మంది ఎమ్మెల్యేలు రాజీనామా సమర్పించడంతో.. రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభ కలకలం రేగింది. ఈ పరిణామాలపై అధిష్టానం గుర్రుగా ఉంది. భేటీకి హాజరుకాని ఎమ్మెల్యేలకు అధిష్టానం షోకాజ్‌ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడాలని నిర్ణయించిన అశోక్ గెహ్లాట్.. ముఖ్యమంత్రిగానూ కొనసాగాలని భావించారు. అయితే, ఒకే వ్యక్తికి రెండు పదవులు కుదరవని రాహుల్ గాంధీ చెప్పడంతో అసలు రచ్చ మొదలైంది. సీఎం పీఠం నుంచి తప్పుకుంటూనే తనకు విశ్వాసపాత్రుడైన వ్యక్తికి ఆ పదవిని కట్టబెట్టాలని గెహ్లాట్ భావించారు. కానీ, అధిష్ఠానం మాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సచిన్ పైలట్‌ను సీఎం చేయాలని భావించింది.

దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న గెహ్లాట్ మాత్రం ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న సీపీ జోషికి ఆ పదవిని కట్టబెట్టాలని భావించారు. రెండేళ్ల క్రితం గెహ్లాట్ సర్కారుపై సచిన్ పైలట్ తిరుగుబాటు చేశారు. ఇప్పుడిదే ఆయనను సీఎం కాకుండా అడ్డుపడుతోంది. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నించిన వ్యక్తికి సీఎం పీఠం ఎలా అప్పగిస్తారన్నది గెహ్లాట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేల అభ్యంతరం. అప్పట్లో ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన వారిలో ఒకరిని ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు.  తాజా పరిస్థితుల నేపథ్యంలో గెహ్లాట్‌ను గనుక తప్పిస్తే.. శశిథరూర్‌తో పాటు దిగ్విజయ్‌ సింగ్‌, ముకుల్‌ వాస్నిక్‌ లాంటి కొందరు నేతలు రేసులో నిల్చునే అవకాశాలు కనిపిస్తున్నాయి.   

మరిన్ని వార్తలు