బెగ్గర్లకు బంపరాఫర్: ప్రభుత్వం నుంచి రోజుకు రూ.215

6 Feb, 2021 08:50 IST|Sakshi

రాజస్తాన్‌లో బెగ్గర్స్‌ ఫ్రీ క్యాపిటల్‌‌ కార్యక్రమం

యాచకులుకు యోగా, కంప్యూటర్‌ తరగతులు

రాజస్తాన్‌: ఇంట్లో నుంచి బయటకు వచ్చామంటే ఎక్కడో ఒకదగ్గర యాచకులు తారసపడుతుంటారు. కొందరు వారి పరిస్థితిని అర్థం చేసుకుని చేయగలిగిన సాయం చేస్తే మరికొందరు విస్కుంటూ ఉంటారు. కానీ ఇటువంటి వారి జీవితాలు మర్చేందుకు రాజస్థాన్‌ ప్రభుత్వం అక్కున చేర్చుకుంటోంది. ఈ క్రమంలోనే జైపూర్‌లో ‘బెగ్గర్‌ఫ్రీ’ అనే వినూత్న కార్యక్రమానికి రాజస్థాన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాజ​స్తాన్‌ స్కిల్‌ అండ్‌ లైవ్లీహుడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఎస్‌ఎల్‌డీసీ), సోపన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్, టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ భాగస్వామ్యంతో బెగ్గర్‌ ఫ్రీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం 43 మంది యాచకులను చేరదీశారు. వీరంతా ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల నుంచి జైపూర్‌ లో యాచిస్తూ జీవిస్తున్నారు. ఈ 43 మందికి వసతి సదుపాయం కల్పించి, యోగా నేర్పించడం, ఆటలు ఆడించడం, కంప్యూటర్‌ తరగతులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. బెగ్గర్స్‌ ఫ్రీ కార్యక్రమం గురించి రాజస్థాన్‌ స్కిల్‌ అండ్‌ లైవ్లీహుడ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నిరజ్‌ కుమామర్‌ పవన్‌ మాట్లాడుతూ... రాష్ట్రంలోని యాచకులందర్ని బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. యాచకులు లేని రాష్ట్రంగా రాజస్థాన్‌ను తీర్చిదిద్దాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు పవన్‌ తెలిపారు. 

రాజస్థాన్‌ పోలీసులు జైపూర్‌లో నిర్వహించిన సర్వే ఆధారంగా బెగ్గర్స్‌ ఫ్రీ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించామని, దీనికోసం ‘కౌశల్‌ వర్ధన్‌’ అనే కేంద్రాన్ని ఏర్పాటు చేసి బ్యాచుల వారీగా శిక్షణ నిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం 20 మంది నైపుణ్య శిక్షణ పొందుతున్నారని, శిక్షణ పూరై్తన తరువాత ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. తొలిసారి జైపూర్‌లో ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయవంతమైతే భవిష్యత్తులో రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.
 
యోగా ట్రైయినర్‌ మాట్లాడుతూ.. సాధారణ వ్యక్తులతో పోలిస్తే వీరు కాస్త భిన్నంగా ఉంటారు. మానసికంగానే గాక, వివిధ అనారోగ్య సమస్యలతో శారీరకంగానూ బలహీనంగా ఉంటారు. అందువల్ల వ్యక్తిగతంగా మాట్లాడి మానసిక, శారీరక స్థితిగతులను అంచనావేసిన తరువాత వారికి యోగా నేర్పిస్తున్నట్లు చెప్పారు. ‘‘సమాజంలో యాచకులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడమే తమ లక్ష్యమని సోపన్‌ సంస్థ  అధికారి చెప్పారు. మూడున్నర నెలలపాటు వారికి శిక్షణతోపాటు రాజస్థాన్‌ ప్రభుత్వం వారికి రోజుకు రూ.215 చెల్లిస్తుంది. ఈ నగదు భవిష్యత్తులో వ్యాపార అవసరాలకు ఉపయోగపడుతుందని వివరించారు. 
 

మరిన్ని వార్తలు